Bhatti vikramarka: పెద్దలనే కాదు.. పేదలనూ చూడండి

బ్యాంకులు సామాజిక, మానవీయ కోణంలో రుణసాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బడా పారిశ్రామిక వేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వారికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని వారు సూచించారు.

Published : 20 Jun 2024 06:13 IST

మానవీయకోణంలో రుణసాయం అవసరం
అన్నదాతలను శక్తిమంతం చేయాలి
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి తుమ్మల

2024-25 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న భట్టి విక్రమార్క, తుమ్మల.
చిత్రంలో కమల్‌ ప్రసాద్‌ పట్నాయక్, రాజేశ్‌కుమార్, రామకృష్ణారావు, దేబాశీశ్‌మిత్ర, సుశీల 

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకులు సామాజిక, మానవీయ కోణంలో రుణసాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బడా పారిశ్రామిక వేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వారికి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని వారు సూచించారు. ఈ వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని, బ్యాంకులు అన్నదాతలకు భారీఎత్తున రుణసాయంతో వారిని శక్తిమంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. ‘‘సామాజిక ఎజెండానే మా ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. బ్యాంకర్లకు సానుకూల దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు. సబ్సిడీ పథకాలకు సంబంధించి ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తున్నా బ్యాంకర్లు సహకరించడం లేదు. రుణాల విషయంలో ప్రైవేటు బ్యాంకులు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ, జాతీయ బ్యాంకులు వెనకంజలో ఉంటున్నాయి. జాతీయ బ్యాంకుల శాఖల సంఖ్య తగ్గడం సరైంది కాదు. మహిళా సంఘాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు అందించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా తరహా పరిశ్రమలకు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో రుణాలు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని భట్టి తెలిపారు. 

ఆశించిన స్థాయిలో రుణసాయం లేదు: తుమ్మల 

‘‘దశాబ్దాలుగా రైతేరాజు అంటున్నాం. కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోంది. రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. దీనిపై బ్యాంకింగ్‌ వ్యవస్థలోని వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో 73.11 శాతం చిన్న, సన్నకారు రైతుల వాటా ఉన్నా వారికి రుణసాయం ఆశించిన స్థాయిలో లేదు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చే రుణాలు 100 శాతానికి చేరాలి. రాష్ట్రంలో 18,654 మంది రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేపడితే కేవలం 50 మంది కంటే తక్కువ రైతులకు రుణాలు మంజూరు చేయడం శోచనీయం. రైతులు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయమంటే బ్యాంకర్లు స్పందించడం లేదు. ఆహారశుద్ధి పార్కులను, పరిశ్రమలను మంజూరు చేసినా వాటికి రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకులు ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి ఆ దిశగా పనిచేయాలి’’ అని తుమ్మల సూచించారు. ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక రుణప్రణాళికను మంత్రులు విడుదల చేశారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నాబార్డు సీజీఎం చింతల సుశీల, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్‌ దేబాశీశ్‌మిత్ర, ఆర్‌బీఐ రీజీనల్‌ మేనేజర్‌ కమల్‌ ప్రసాద్‌ పట్నాయక్, ఎస్‌బీఐ సీజీఎం రాజేశ్‌కుమార్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని