TG High Court: కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌ విచారణతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి.ఘోష్‌ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 05 Jul 2024 04:11 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా లేకుండా సీబీఐ విచారణకు ఆదేశాలా?
ప్రాజెక్టు పనులపై దాఖలైన పలు పిటిషన్ల విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు
విచారణ రెండు వారాలకు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌ విచారణతోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పి.సి.ఘోష్‌ నేతృత్వంలోనూ న్యాయ విచారణ జరుగుతోందని, ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోలేమని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగుబాటు తదితరాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్, న్యాయవాది బి.రామ్మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరామరెడ్డి, న్యాయవాది ముధుగంటి విశ్వనాథరెడ్డి, బక్క జడ్సన్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై విచారణ పూర్తికాకపోవడంతో జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పిటిషనర్‌ రామ్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తన పిటిషన్‌ ఈ కమిషన్‌ ఏర్పాటుకాక ముందు వ్యవహారాలపై దాఖలు చేశానని, అవినీతి వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరానని, సింగిల్‌ జడ్జి వద్ద ఈ పిటిషన్‌లో సీబీఐ కూడా కౌంటరు దాఖలు చేసిందని తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్‌ కపాటియా వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా కేంద్రాన్ని, సీబీఐనే పేర్కొన్నారని అదనపు ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాదన వినకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయడానికి అనుమతించాలని న్యాయవాది రామ్మోహన్‌రెడ్డి కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

జడ్సన్‌ పిటిషన్‌ ఉపసంహరణకు నిరాకరణ

కాళేశ్వరం పనులపై రాజకీయ కార్యకర్త బక్క జడ్సన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరణకు ధర్మాసనం నిరాకరించింది. జడ్సన్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతున్నందున తాము పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపారు. పిటిషన్‌లోని అంశాలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని, కమిషన్‌ నివేదిక వచ్చిన తరువాత కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకసారి పిటిషన్‌ వేసిన తరువాత పిటిషనర్‌ పాత్ర పరిమితంగా ఉంటుందని పేర్కొంది. కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి అనుమతిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఉపసంహరణకు నిర్ణయించుకుంటే దరఖాస్తు చేసుకోవాలని, దానిపై ఉత్తర్వులు జారీ చేస్తామని, ఆ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చంది. ఈ పిటిషన్‌పై విచారణను కూడా రెండు వారాలకు వాయిదా వేస్తున్నామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని