TG EAPCET 2024: నేటి నుంచి ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

Updated : 04 Jul 2024 08:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. 4 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వారికి ఈ నెల 19వ తేదీ లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయిస్తామని ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.

ఎప్‌సెట్‌ వెబ్‌సైట్‌లోనే ప్రవేశాల లింక్‌ 

గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్‌సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మరో వెబ్‌సైట్‌ ఉండేది. దాంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈ సారి ఎప్‌సెట్‌ వెబ్‌సైట్‌ (www.eapcet.tsche.ac.in) లోకి వెళ్లినా అక్కడ అడ్మిషన్‌పై క్లిక్‌ చేస్తే కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌ (www.tseapcet.nic.in)లోకి వెళ్లొచ్చు.

ఇంకా జీవోలు రాలేదు..

ఈ సారి మల్లారెడ్డి గ్రూపులోని ఒక కళాశాలను మరో కళాశాలలో విలీనం చేశారు. బాచుపల్లిలోని గోకరాజు ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం కింద ఉన్న లీలావతి మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలను కో-ఎడ్యుకేషన్‌గా మార్చేందుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ఈ రెండు మార్పులపై విద్యాశాఖ బుధవారం రాత్రి వరకు జీవోలు జారీ చేయలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాలకు కూడా ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈ సారి కూడా ఆనవాయితీగా చివరి నిమిషంలోనే కళాశాలలకు అనుమతులివ్వడంతోపాటు సీట్ల సంఖ్య వెల్లడించాల్సిన పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని