Sheep Distribution Scam: అంతిమ లబ్ధిదారులే కీలకం

గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది.

Published : 16 Jun 2024 06:22 IST

రూ.700 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా
‘గొర్రెల కుంభకోణం’ అసలు సూత్రధారులకు ఉచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలో బినామీ ఖాతాల్లోని లావాదేవీలే కీలకం కానున్నాయి. ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి వివరాలు సేకరిస్తుండటంతో ఈ లావాదేవీలే నిందితుల మెడకు ఉచ్చు బిగించనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుంభకోణంలో ఇప్పటివరకు అనిశా 10 మంది నిందితుల్ని గుర్తించి.. 8 మంది పశుసంవర్ధకశాఖ అధికారులను అరెస్టు చేసింది. దారి మళ్లిన సొమ్ములో వీరు వాటాదారులు మాత్రమేనని దర్యాప్తులో తేలింది. మిగిలిన సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లిందని తేల్చడంపైనే ఈడీ దృష్టి సారించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గొర్రెల కొనుగోలుకు ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందనే సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది.

ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది..? 

ఈ పథకం కోసం అప్పటి ప్రభుత్వం రెండు విడతల్లో సుమారు రూ.11 వేల కోట్ల నిధుల్ని కేటాయించింది. ఆ సొమ్ము ఎవరెవరి ఖాతాల్లోకి చేరిందని ఆరా తీయడంలో ఈడీ నిమగ్నమైంది. ఈ పథకంలో అనధికార ఏజెంట్లుగా వ్యవహరించిన మొహిదుద్దీన్‌ లాంటి దళారులు తమ బినామీల ఖాతాల్లోకి ఈ డబ్బును బదిలీ చేయించుకున్నట్లు ఇప్పటికే అనిశా గుర్తించింది. ఈ వివరాలు ఇప్పుడు ఈడీ దర్యాప్తునకు కీలకం కానున్నాయి. బినామీల వాంగ్మూలాలు సేకరించడం ద్వారా మొహిదుద్దీన్‌తోపాటు మరికొందరు దళారులను గుర్తించి.. సూత్రధారుల గుట్టు రట్టు చేయాలని ఈడీ భావిస్తోంది.  

మొహిదుద్దీన్‌.. కల్యాణ్‌లే కీలకం

అనిశా కేసులో కీలక నిందితులుగా ఉన్న మొహిదుద్దీన్, అతడి తనయుడు ఇక్రమ్‌ ప్రస్తుతం విదేశాల్లో మకాం వేశారు. వారిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే కేసులో గత ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా వ్యవహరించిన కల్యాణ్‌ను అనిశా ఇప్పటికే అరెస్టు చేసింది. మొహిదుద్దీన్‌ బినామీ ఖాతాలతో సొమ్ము కొట్టేయగా.. దానిని తిరిగి కల్యాణ్‌ ద్వారా సూత్రధారులకు చేర్చి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తులో వీరిద్దరి వాంగ్మూలాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే కల్యాణ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు