Enforcement: స్థిరాస్తి వ్యాపారంలోకి అక్రమ మైనింగ్‌ సొమ్ము!

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై సంస్థ అక్రమ మైనింగ్‌ ద్వారా ఆర్జించిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

Updated : 22 Jun 2024 07:09 IST

ప్రాథమిక దర్యాప్తులో ఈడీకి ఆధారాలు లభ్యం
బినామీల పేరిట భారీగా ఆస్తుల పత్రాల స్వాధీనం 
రూ.19 లక్షల నగదు జప్తు.. బ్యాంకు లాకర్ల గుర్తింపు
పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి ఇంట్లో సోదాలపై నోట్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై సంస్థ అక్రమ మైనింగ్‌ ద్వారా ఆర్జించిన సొమ్మును స్థిరాస్తి వ్యాపారానికి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. అక్రమ మైనింగ్‌ నిధులను మనీలాండరింగ్‌ ద్వారా మళ్లించినట్లు అందిన ఫిర్యాదుతో ఈడీ బృందాలు గురువారం పటాన్‌చెరులో 10 చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లెక్కల్లో లేని రూ.19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెల్‌ఫోన్లను సీజ్‌ చేయడంతోపాటు వీరి నివాసాల నుంచి పెద్దఎత్తున ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అవన్నీ ఇతరుల పేర్లతో రిజిస్టరై ఉండటంతో వీరికి బినామీలై ఉంటారని అనుమానిస్తున్నారు. వాటి గురించి లోతుగా ఆరా తీయడం ద్వారా మనీలాండరింగ్‌పై ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు. వారి బ్యాంకు లాకర్ల తాళాలను సైతం స్వాధీనం చేసుకున్నారు.  

రూ.39.08 కోట్ల రాయల్టీ ఎగవేత 

మధుసూదన్‌రెడ్డిపై తొలుత తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నుంచి లీజు ద్వారా అనుమతి తీసుకున్న స్థలంలో పరిమితికి మించి మైనింగ్‌ చేయడంతోపాటు ప్రభుత్వ భూమిలోనూ తవ్వకాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలా అక్రమంగా రూ.300 కోట్ల వరకు ఆర్జించినట్లు వెల్లడైంది. ఆ సొమ్ముపై లావాదేవీలను బ్యాంకుల ద్వారా జరగకుండా చూసినట్లు దర్యాప్తు సందర్భంగా ఈడీ అధికారుల దృష్టికి వచ్చింది. మరోవైపు మైనింగ్‌ కార్యకలాపాలపై ప్రభుత్వానికి అధికారికంగా చెల్లించాల్సిన రూ.39.08 కోట్ల రాయల్టీని మధుసూదన్‌రెడ్డి ఎగవేసినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. 

సోదాల సమయంలో ఎమ్మెల్యే నిద్ర! 

పటాన్‌చెరు అర్బన్, న్యూస్‌టుడే: ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అక్కడే ఉన్నట్లు తెలిసింది. తనిఖీలు జరిగినంత సేపు ఇంట్లోనే ఉండి... ‘‘ఏం తనిఖీలు చేసుకుంటారో చేసుకోండి’’ అంటూ ఆయన నిద్రపోయారు. శుక్రవారం తన అనుచరులతో ఎమ్మెల్యే ఇదే విషయాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని