Sheep Distribution scam: గొర్రెల పథకం అక్రమాలపై ఈడీ విచారణ

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

Published : 13 Jun 2024 03:09 IST

రూ. 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్‌పై దృష్టి
వివరాలివ్వాలని రాష్ట్ర అధికారులకు లేఖ
అనిశా విచారణలో పెదవి విప్పని నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని.. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధకశాఖ (అనిశా) విచారణ చేస్తుండగా.. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో.. ఇందులో మనీ లాండరింగ్‌ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారు.. ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొంది.

నిందితులు మళ్లీ జైలుకు.. 

గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో అనిశా అధికారులు మళ్లీ వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనిశా అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్టయి జైల్లో ఉన్న పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను అనిశా అధికారులు న్యాయస్థానం అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి ఆద్యులెవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, పదే పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డుల్లో ఎలా చూపించారు, ఆడిటింగ్‌లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు.. తదితర వివరాలు రాబట్టేందుకు అనిశా వీరిద్దర్నీ మూడు రోజులపాటు విచారించింది. అసలు గొర్రెలు అమ్మింది ఒకరైతే.. వాటి తాలూకు డబ్బు దళారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇలా ఎలా చేశారన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు అనిశా ప్రయత్నించింది. కానీ మూడు రోజులపాటు అనేక రకాలుగా ప్రశ్నించినా.. నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. మూడు రోజుల గడువు ముగిసిపోవడంతో అనిశా అధికారులు బుధవారం నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని