ED: బినామీల విచారణకు రంగం సిద్ధం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి అక్రమార్జన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది.

Updated : 23 Jun 2024 05:46 IST

భూదస్తావేజుల ఆధారంగా నోటీసుల జారీకి కసరత్తు
రూ.300 కోట్ల అక్రమార్జన కేసులో దర్యాప్తు ముమ్మరం

ఈనాడు, హైదరాబాద్‌: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి అక్రమార్జన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై సంస్థ ద్వారా అక్రమ మైనింగ్‌కు పాల్పడి సుమారు రూ.300 కోట్ల మేర ఆర్జించినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆ సొమ్మును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు ఇప్పటికే కీలక సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలో ఆ పెట్టుబడుల మూలాలను సమగ్రంగా తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలతోపాటు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు లభ్యమైన భూదస్తావేజులపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిలో చాలావరకు దస్త్రాలు ఇతరుల పేర్లపై రిజిస్టరయి ఉండటంతో వారిని బినామీలుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి నోటీసులిచ్చి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ భూములు తమవేనని చెబితే వాటి కొనుగోళ్లకు డబ్బెలా సమకూర్చుకున్నారో ఆరా తీయనున్నారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కేసు కావడంతో బినామీలు నోరు విప్పక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నగదు లావాదేవీలే ఎందుకు..? 

అక్రమ మైనింగ్‌ ద్వారా ఆర్జించిన సొమ్ము ఆనవాళ్లు ఎక్కడా రికార్డుల్లోకి ఎక్కకుండా జాగ్రత్త పడినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. క్వారీలో కంకర విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును నగదు రూపంలో మాత్రమే తీసుకోవడం ఇందులో భాగమేనని అనుమానిస్తోంది. సంస్థ బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది. భూదస్తావేజుల గుట్టు వీడితేనే అక్రమార్జన పెట్టుబడుల డొంక కదులుతుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బినామీలు ఇవ్వనున్న వాంగ్మూలాలపై ఉత్కంఠ నెలకొంది. అలాగే మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిస్తే మరింత కీలక సమాచారం లభిస్తుందని ఈడీ అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని