Viveka Murde case: తొలి గొడ్డలి వేటు ఉమాశంకర్‌రెడ్డిదే

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కడప కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిన తరుణంలో

Updated : 24 Mar 2022 05:07 IST

 వివేకా కేసులో సీబీఐ వాదనలు
బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డికి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కడప కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకోవాల్సిన తరుణంలో ఉమాశంకర్‌రెడ్డికి బెయిలివ్వడం సరైంది కాదని వాదించింది. వివేకా తలపై గొడ్డలితో తొలి దాడి చేసింది ఉమాశంకర్‌రెడ్డేనని దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కడప కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులిచ్చింది. హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ జరిగింది. వాచ్‌మేన్‌ రంగన్న, అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలాల ప్రకారం వివేకాను హత్య చేసిన నలుగురిలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. వివేకాను ఆయన ఇంట్లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి కలిసి హత్య చేశారని, ఆ సమయంలో తిడుతూ గొడ్డలితో ఆయన తలపై తొలివేటు వేసింది ఉమాశంకర్‌రెడ్డేనని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు కోర్టుకు నివేదించింది. అయిదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని... అందులో భాగంగానే గంగాధర్‌రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన తరువాత మాట మార్చారని పేర్కొంది. అసలైన కుట్రదారులను తెలుసుకునేందుకు ఉమాశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు చేయించడానికి పులివెందుల కోర్టులో పిటిషన్‌ వేస్తే, అతను నిరాకరించారని సీబీఐ గుర్తు చేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో దస్తగిరి, రంగన్న భద్రతపై సీబీఐ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు