మెరుగైన ఫలాలు అందించే వాటికి ప్రాధాన్యం

‘ప్రజాధనం వ్యయంలో సహేతుకమైన విధానం’ అవలంబించాలన్న యోచనలో భాగంగా..ప్రభుత్వం కొనసాగుతున్న పథకాలను సమీక్షించింది. ఫలితాలు అందించనివి, ఒకే ఉద్దేశంతో ఉన్న వాటిని విలీనం చేసింది.

Published : 07 Feb 2023 07:22 IST

రాష్ట్ర ఆర్థిక వ్యూహం ఇదీ..

ఈనాడు, హైదరాబాద్‌: ‘ప్రజాధనం వ్యయంలో సహేతుకమైన విధానం’ అవలంబించాలన్న యోచనలో భాగంగా..ప్రభుత్వం కొనసాగుతున్న పథకాలను సమీక్షించింది. ఫలితాలు అందించనివి, ఒకే ఉద్దేశంతో ఉన్న వాటిని విలీనం చేసింది. సమగ్ర సమీక్ష అనంతరం రాష్ట్రానికి ఉపయోగంగా ఉండే పథకాలనే కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానంలో ఈ విషయం స్పష్టం చేసింది. ప్రధానంగా తక్కువ ఉత్పాదకత ఉన్న పథకాలపై వ్యయాన్ని గుర్తించి, ఆ నిధులను మెరుగైన ఫలితాలు అందించేవాటిపై వెచ్చించడానికి ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పనులను చేపట్టడంకంటే కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. శాఖల మధ్య సమన్వయమే లక్ష్యంగా పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగానే గృహనిర్మాణ శాఖను ఆర్‌ అండ్‌ బీలో విలీనం చేయగా, రిజిస్ట్రేషన్‌ విధానంలో పారదర్శకత తీసుకువచ్చి అవినీతికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకుంది. 

పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి

2022-23లో పెట్టుబడి వ్యయం పెంచేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారం వేయకుండా సమర్థంగా పన్నుల వసూళ్లకు చర్యలు తీసుకుంది. విచక్షణాధికారాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శక విధానాలకు పెద్దపీట వేసింది. ఫలితంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్ల రాబడిని గణనీయంగా పెంచుకుంది. 2022-23లో సొంత పన్నులరాబడి రూ.1,10,592 కోట్లు కాగా, 2023-24లో పన్నులరాబడి రూ.1,31,029 కోట్లుగా పేర్కొంది. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేలా తీసుకున్న ప్రత్యేక చర్యలు ఫలించాయని వివరించింది.

జీఎస్డీపీలో 25 శాతం మించకుండా రుణాలు

15వ ఆర్థిక సంఘం అంచనాల కంటే తక్కువ మొత్తంలో రుణాలను తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో జీఎస్డీపీలో రాష్ట్ర అప్పులు 2023-24లో 33.1 శాతం, 2024-25లో 32.8 శాతం, 2025-26లో 32.5 శాతం ఉంటాయని అంచనా వేయగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో రుణాలపై వ్యవహరిస్తున్నట్లు బడ్జెట్‌ నివేదికల్లో పేర్కొంది. జీఎస్డీపీలో 25 శాతం.. అంతకంటే తక్కువ రుణాలు ఉండేలా  దృష్టిసారించినట్లు వివరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీలో రుణాల శాతం 23.8 శాతమే అని వివరించింది. 2021-22లో జీఎస్డీపీలో రుణాల వాటా 24.69 శాతం కాగా, 2022-23లో సవరించిన అంచనాల మేరకు 24.33 శాతమని తెలిపింది.


కొత్త బడ్జెట్‌.. సంక్షేమానికి గీటురాయి
బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ కృష్ణమోహన్‌రావు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ కొత్త బడ్జెట్‌ సంక్షేమానికి గీటురాయిగా ఉందని, అభివృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తుందని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. బడ్జెట్‌ రూపకల్పన, నిధుల కేటాయింపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు అద్దంపడుతున్నాయని అన్నారు. మహిళా సంక్షేమానికి, దళితబంధుకు భారీగా నిధులను కేటాయించడంపై టీఎస్‌ఫుడ్స్‌ ఛైర్మన్‌ రాజీవ్‌సాగర్‌ శాసనసభలో మంత్రి హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌ దేశానికి ఆదర్శంగా ఉందని భారాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల, మైనారిటీ నేత బద్రుద్దీన్‌లు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని