Pharma University: ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి

ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు.

Published : 08 Jul 2024 03:34 IST

ఫార్మాస్యూటికల్‌ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న పార్థసారథిరెడ్డి, టీవీ నారాయణ తదితరులు 

మాదాపూర్, న్యూస్‌టుడే: ఫార్మా విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోనే ఏర్పాటుచేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్‌.. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్న 73వ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ కాంగ్రెస్‌ సదస్సు ఆదివారం ముగిసింది. కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ‘‘దేశ ఎగుమతుల్లో 5 శాతం కన్నా ఎక్కువ వాటా ఫార్మా రంగానిదే. గతేడాది భారత్‌ రూ.1.83 లక్షల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో 35 శాతం ఒక్క అమెరికాకే ఎగుమతి చేశాం. కరోనా సమయంలో భారత్‌ యుద్ధప్రాతిపదికన టీకా తయారుచేసి ప్రపంచానికి అందజేసింది. దాదాపు 75 మిలియన్‌ డోసులను 94 దేశాలకు అందజేయడంతో మనదేశం విశ్వబంధుగా కీర్తి గడించింది. 

5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా..

త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో మనదేశం ముందుకు సాగుతోంది. 2027 నాటికి భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపాలనే సంకల్పంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం అవినీతిరహిత పాలన, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గ్యారంటీ ఇస్తుంది. కాలం చెల్లిన 1562 చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.15 వేల కోట్లు కేటాయించింది. రాబోయే బల్క్‌డ్రగ్‌ పార్కులో కామన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫెసిలిటీస్‌ను పెంచడానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుంది. భారతీయ ఫార్మా రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ఫార్మాస్యూటికల్‌ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ అసిస్టెన్స్‌ స్కీం దోహదపడుతుంది. 

ఆరోగ్యరంగ మెరుగుకు కృషి 

దేశంలో ఆరోగ్యరంగాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. 2014లో 388 వైద్య కళాశాలలుంటే ఇప్పుడు వాటిసంఖ్య 706కు పెంచాం. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా 12 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వైద్య బీమా కల్పిస్తున్నాం. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50-90 శాతం తక్కువ ధరకే మందులు అందిస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఐపీసీఏ అధ్యక్షుడు బి.పార్థసారథిరెడ్డి, ప్రధాన కార్యదర్శి టీవీనారాయణ, సదస్సు నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎ.రామ్‌కిషన్, ఛైర్మన్‌ జేఏఎస్‌ గిరి, సంయుక్త కార్యదర్శి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇన్‌ఛార్జి గవర్నర్‌తో కిషన్‌రెడ్డి భేటీ 

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో ఆదివారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛమిచ్చి సత్కరించారు. పలు అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని