Assembly Elections: పంచతంత్రం మొదలు..

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Published : 09 Jan 2022 05:53 IST

5 రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా.. 7 దశల్లో పోలింగ్‌
ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు..
మార్చి 10న ఓట్ల లెక్కింపు
షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు
ఈ నెల 15 వరకు ర్యాలీలకు అనుమతి లేదు  

ఎన్నికల వివరాలు ప్రకటిస్తున్న సీఈసీ సుశీల్‌ చంద్ర

ఈనాడు, దిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి చేపడతారు. శనివారం విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌చంద్ర ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. 2012లో 9, 2017లో 8 దశల్లో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలను ఈసారి 7 దశల్లోనే పూర్తిచేయబోతున్నట్లు చెప్పారు. తొలుత పశ్చిమ యూపీ ప్రాంతానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ నెల 14న వెలువడుతుందన్నారు. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో యూపీలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో ఫిబ్రవరి 14న; మణిపుర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు ఎలాంటి రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్‌/ బైక్‌ ర్యాలీలకు అనుమతివ్వడంలేదని ప్రకటించారు. ఆ తర్వాత పరిస్థితులను సమీక్షించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 మధ్య ప్రచారం చేయకూడదన్నారు. పోలింగ్‌ సమయాన్ని గంట పెంచుతున్నామని, ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నామని సీఈసీ తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ.40 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

ఓటర్లు 18.34 కోట్లు

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో 8.55 కోట్ల మంది మహిళలు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సుశీల్‌చంద్ర పేర్కొన్నారు. 2,15,368 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశామని, గత ఎన్నికలతో పోలిస్తే ఇవి 16% అధికమని చెప్పారు. పోలింగ్‌ బూత్‌లలో ఓటర్ల గరిష్ఠ సంఖ్యను 1,500 నుంచి 1,250కి తగ్గించినట్లు చెప్పారు. ఒక్కో పోలింగ్‌బూత్‌లో సగటు ఓటర్ల పరంగా చూస్తే ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ సంఖ్య అని చెప్పారు. 1,620 పోలింగ్‌ స్టేషన్లను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారని తెలిపారు. దీనివల్ల మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఓటు వేయొచ్చన్నారు. కొన్ని పోలింగ్‌ స్టేషన్లను దివ్యాంగ సిబ్బందితో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనివల్ల వారిలో స్ఫూర్తి నింపడానికి వీలవుతుందన్నారు.

కొవిడ్‌ రోగులకూ పోస్టల్‌ బ్యాలెట్‌

80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్‌ రోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు సుశీల్‌చంద్ర చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేవారందరికీ రెండు డోసుల టీకా పూర్తయి ఉండాలన్నారు. సభలు, సమావేశాలకు హాజరయ్యేవారి గరిష్ఠ సంఖ్యపై పరిమితులు విధించనున్నట్లు వెల్లడించారు. వాటికి వచ్చేవారికి మాస్కులు, శానిటైజర్లు సమకూర్చాలని పార్టీలకు సూచించారు. పార్టీలు, అభ్యర్థులు సాధ్యమైనంతమేర డిజిటల్‌, వర్చువల్‌, మొబైల్‌ ఆధారిత ప్రచారాలను ఎంచుకోవాలని సూచించారు. ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతివ్వనున్నట్లు చెప్పారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని ప్రకటించారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన పార్టీలు, అభ్యర్థులకు తదుపరి సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతులివ్వబోమని స్పష్టంచేశారు. ఈ రాష్ట్రాల్లో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శుల్ని కోరినట్లు చెప్పారు.

బడ్జెట్‌ సమర్పణకు అడ్డేమీ లేదు

కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు, ఆ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగానికి ఎన్నికల షెడ్యూలు అడ్డంకి కాదని సీఈసీ స్పష్టం చేశారు. దానిలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమన్నారు. వార్షిక బడ్జెట్‌ తయారీ కసరత్తు వల్ల ఎన్నికల రాష్ట్రాల్లో పార్టీల సమానావకాశాలకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పారు. బడ్జెట్‌ అనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశమని, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే పరిమితం కాదని అన్నారు.

నేర చరిత్రను వెల్లడించాలి.. ఎంపికకు కారణాలు వివరించాలి

అన్ని పార్టీలూ తమ అభ్యర్థుల నేర నేపథ్యాన్ని పార్టీ వెబ్‌సైట్‌ ముఖ పేజీలోనే స్పష్టంగా వెల్లడించాలని సీఈసీ స్పష్టంచేశారు. అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలు, ఆ అభ్యర్థిని ఎంపికచేయడానికి కారణాలు వివరించాలని చెప్పారు. ఎన్నికల ఖర్చు గరిష్ఠ పరిమితిని పెంచినట్లు తెలిపారు. ఈవీఎంలతో ఏ సమస్యా లేదని, ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన నాటినుంచి ఇప్పటివరకూ 350 కోట్లమంది ఓటర్లు వీటిని వినియోగించుకున్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని