ED: పటాన్‌చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. భారాసకు చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

Published : 21 Jun 2024 06:15 IST

అక్రమ మైనింగ్‌తో రూ.300 కోట్ల ఆర్జన అభియోగాల నేపథ్యంలో..
ఆయన సోదరుడి నివాసంలోనూ తనిఖీలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించి తిరిగివెళుతున్న ఈడీ సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, పటాన్‌చెరు అర్బన్‌: రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు కలకలం రేపాయి. భారాసకు చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వేకువ జామున 5 గంటలకే పటాన్‌చెరు రామమందిర్‌రోడ్డులోని ఎమ్మెల్యే ఇంటితోపాటు... అక్కడే శ్రీనగర్‌కాలనీలో ఉన్న ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి. తొలుత ఎమ్మెల్యేతో పాటు కుటుంబసభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల విషయం తెలుసుకొని ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకొని ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. సీఆర్పీఎఫ్‌ బలగాలు అడ్డుకున్నాయి. మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలోని సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై సంస్థ  అక్రమ మైనింగ్‌తో సుమారు రూ.300 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడిందనే అభియోగాల నేపథ్యంలో ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఒక బృందం క్వారీలోనూ తనిఖీలు నిర్వహించింది. సోదాల సందర్భంగా కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గంటలకొద్దీ సోదాలు నిర్వహించిన ఈడీ బృందాలు రాత్రి 7 గంటల సమయంలో మధుసూదన్‌రెడ్డిని ఆయన కుటుంబానికి చెందిన జీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌కు తీసుకెళ్లి, అక్కడ విచారించాయి. 

ఇవీ అభియోగాలు... 

పటాన్‌చెరు మండలం లక్డారంలోని సర్వే నంబరు.738లో కంకర క్వారీకి గూడెం మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలోని సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ సప్లై కంపెనీ అనుమతి తీసుకొంది. 2012-2027 వరకు 4.23 హెక్టార్ల స్థలంలో క్వారీ నిర్వహణకు భూగర్భ గనులశాఖ అనుమతించింది. అయితే లీజు పొందిన స్థలంలోనే కాకుండా పక్కనున్న స్థలంలోనూ మధుసూదన్‌రెడ్డి కంకర సేకరించి అమ్ముకున్నారు. మరో 4.37 హెక్టార్ల స్థలాన్ని ఆక్రమించి మైనింగ్‌ నిర్వహించారు. స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే తవ్వకాలు సాగించారు. ఈ విషయం గుర్తించిన అథారిటీ క్వారీని మూసేయాలని గతేడాది మార్చి 10న ఆదేశించింది. అయినా మధుసూదన్‌రెడ్డి ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మైనింగ్‌ కొనసాగించారు. 

  • ఈక్రమంలో మధుసూదన్‌రెడ్డి లీజు స్థలంలో అనుమతించిన పరిమితికి మించి 11,93,743 క్యూబిక్‌ మీటర్ల కంకరను అక్రమంగా సేకరించారు. ఇందుకుగాను ప్రభుత్వానికి రూ.21.10 కోట్ల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో కంకర విలువ రూ.163.03 కోట్లు అని తేల్చారు. ఆక్రమించిన స్థలంలో 10,11,763 క్యూబిక్‌ మీటర్ల కంకర సేకరించారు. దీనికి ప్రభుత్వానికి రూ.17.89 కోట్ల రాయల్టీ చెల్లించాల్సి ఉందని తేలింది. బహిరంగ మార్కెట్‌లో ఆ కంకర విలువ రూ.137.60 కోట్లని వెల్లడైంది.
  • అక్రమ మైనింగ్‌ ద్వారా మధుసూదన్‌రెడ్డి మొత్తం సుమారు రూ.300 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు అధికార యంత్రాంగం లెక్కగట్టింది. ఈ నేపథ్యంలోనే భూగర్భ గనులశాఖ గత మార్చిలో క్వారీని మూసేసింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణపై పటాన్‌చెరు తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదుమేరకు అదే నెల 15న మధుసూదన్‌రెడ్డిని అరెస్టు చేశారు. కొద్దిరోజులు జైల్లో ఉన్న అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. తాజాగా ఈడీ సోదాలు జరపడం చర్చనీయాంశమైంది. 

ఒత్తిళ్లకు లొంగం

-గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే

డీ సోదాల అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపక్షనేతలు ఎవరినీ వదలడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు సాధారణమే. అలాంటివి ఎన్నో చూశాం. ఇక ముందూ చూస్తాం. ఒత్తిళ్లకు లొంగి రాజీపడం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది ఈడీ పని. ఈడీ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరించాం. అడిగిన అన్ని పత్రాలను సమర్పించాం. నయాపైసా గానీ, బంగారం గానీ దొరకలేదు’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని