EPFO: పీఎఫ్‌ క్లెయిమ్‌ల తిరస్కరణలకు చెక్‌

హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేశారు. పీఎఫ్‌ ఉపసంహరించేందుకు క్లెయిమ్‌ చేసిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో అధికారులు తిరస్కరించారు.

Updated : 10 Dec 2022 09:45 IST

ఎక్కువసార్లు వెనక్కి పంపుతున్న అధికారులపై దృష్టి

అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోండి

ప్రాంతీయ కమిషనర్లకు ఈపీఎఫ్‌వో ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేశారు. పీఎఫ్‌ ఉపసంహరించేందుకు క్లెయిమ్‌ చేసిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో అధికారులు తిరస్కరించారు. ఇలా ఏడాదిలో పదిసార్లు జరిగింది. ఇకపై ఇలా జరగకుండా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కఠిన చర్యలకు సిద్ధమైంది. క్లెయిమ్‌ను ఒకటికన్నా ఎక్కువ సార్లు తిరస్కరిస్తున్న అధికారులపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. క్లెయిమ్‌ పరిష్కరించకుండా జాప్యం చేయడంతో చందాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, సంస్థ జవాబుదారీతనంపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. క్లెయిమ్‌ తిరస్కరణలు తగ్గించడంతో పాటు సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

అలా చేస్తే వేధించినట్లు లెక్క..

క్లెయిమ్‌ పరిష్కారంలో తీవ్రజాప్యం చందాదారులను వేధించినట్లు అవుతుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. కొన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో చందాదారు చేసిన క్లెయిమ్‌ను తరచూ తిరస్కరిస్తున్నట్లు గుర్తించింది. కొందరు ఈపీఎఫ్‌ ఉద్యోగులు కావాలనే ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు అవసరమని సాకులు చూపిస్తున్నారని, దీనివల్ల న్యాయబద్ధంగా సకాలంలో అందాల్సిన భవిష్యనిధి ప్రయోజనాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొంది. ఈ తరహా వ్యవహారాలతో సంస్థకు చెడ్డపేరు వస్తోందని తెలిపింది. ప్రాంతీయ కమిషనర్లు సంబంధిత ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, నిరంతర నిఘాపెట్టాలని ఆదేశించింది.


కారణాలను స్పష్టంగా చందాదారుకి తెలియజేయాలి

‘‘క్లెయిమ్‌ మొదటిసారి తిరస్కారానికి గురైనపుడు కారణాలను స్పష్టంగా చందాదారుకి తెలియజేయాలి. అంతేతప్ప మాటిమాటికి కొత్త కారణాలు చూపిస్తూ తిరస్కరించడం మంచి పద్ధతి కాదు. ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో క్లెయిమ్‌లు పలుసార్లు తిరస్కరించినట్లు వెల్లడైతే సంబంధిత ప్రాంతీయ కమిషనర్లు బాధ్యులు అవుతారు. ప్రతినెలా 50 కన్నా ఎక్కువగా లేదా 1 శాతానికి మించి క్లెయిమ్‌లు తిరస్కరించినట్లు గుర్తిస్తే వెంటనే ప్రాంతీయ కమిషనర్లు నివేదిక సిద్ధం చేసి జోనల్‌ కార్యాలయాలకు పంపించాలి. జోనల్‌ అధికారులు ఈ తిరస్కరణ కారణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి’’ అని ఈపీఎఫ్‌వో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని