EPFO: పదవీ విరమణ రోజే పింఛను మంజూరు

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ‘ప్రయాస్‌’ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరులో ఆలస్యంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 25 Jun 2024 07:20 IST

‘ప్రయాస్‌’ కార్యక్రమం కింద పీపీవోలు జారీ చేయాలి
యాజమాన్యాలు ముందుగానే క్లెయిమ్‌లు ఇవ్వాలి
ప్రాంతీయ కమిషనర్లకు సూచనలిచ్చిన ఈపీఎఫ్‌వో

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగులకు ‘ప్రయాస్‌’ పథకం కింద సత్వర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరులో ఆలస్యంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన రోజే సర్వీసు, వేతనం ఆధారంగా పింఛను ఖరారు చేసి, పింఛను మంజూరు పత్రాలు(పీపీవో) అందించాలన్న లక్ష్యం నాలుగేళ్లుగా నెరవేరడం లేదని పేర్కొంది. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంతో ప్రాంతీయ, జోనల్‌ కార్యాలయాలు ‘ప్రయాస్‌’ లక్ష్యసాధనకు దూరంగా ఉన్నాయని తెలిపింది. ఈపీఎఫ్‌వోలో డిజిటలీకరణలో భాగంగా ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)లో అర్హులైన వారికి పదవీ విరమణ రోజున పీపీవోలు మంజూరు చేయాలని ఈపీఎఫ్‌వో 2020లో ప్రయాస్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటికీ క్లెయిమ్‌ల పరిష్కారంలో నిర్లక్ష్యం, సరైన వివరాలు లేవన్న కారణాలతో పీపీవోలు మంజూరు చేయలేదు. పదవీ విరమణకు ముందుగానే క్లెయిమ్‌లు దాఖలు చేసినా, సర్వీసు వివరాలు రాలేదంటూ తిరస్కరించారు. ఇటీవల సమీక్ష నిర్వహించిన ఈపీఎఫ్‌వో క్షేత్రస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీవిరమణ రోజే పీపీవోల మంజూరుకు.. జోనల్‌ కార్యాలయాలు పరిశ్రమలు, సంస్థల యజమానులకు, మూడునెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తూ అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ (పింఛను) అప్రజిత జగ్గీ ఆదేశాలు జారీ చేశారు. 

ఇవీ నిర్ణయాలు..

  • పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన పింఛను క్లెయిమ్‌లను యాజమాన్యాలు ముందుగానే దరఖాస్తు చేయాలి. 
  • ప్రయాస్‌ పథకం కోసం ఈపీఎఫ్‌వో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ఈ డాష్‌బోర్డు ద్వారా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల్ని గుర్తించి ఆయా ప్రాంతీయ కార్యాలయాలు క్లెయిమ్‌పై నిర్ణయాలు తీసుకోవాలి. 
  • ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయా చట్టాల ప్రకారం పదవీ విరమణ వయసు (58 లేదా 60ఏళ్లు) నాటికి క్లెయిమ్‌లు దరఖాస్తు చేసేలా అవగాహన కల్పించాలి. 
  • పెద్ద సంస్థల్లో ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఈవో) గుర్తిస్తారు. ఒక్కో ఈవోకు రెండు సంస్థలను అప్పగిస్తారు. ఈవోలు అర్హులైన ఉద్యోగుల క్లెయిమ్‌లు దాఖలు చేయించి, ప్రయాస్‌ పథకం కింద సత్వర ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకుంటారు. 
  • ప్రతి నెలా చందాదారుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ‘నిధి ఆప్‌కే నికట్‌’లో ప్రయాస్‌ పథకం కింద అవగాహన కల్పించాలి. 
  • క్లెయిమ్‌లు తిరస్కరణకు గురికాకుండా పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల బదిలీ, వ్యక్తిగత వివరాల్లో మార్పులు ముందుగానే పూర్తిచేసుకోవాలి. ఈ మేరకు వచ్చిన అభ్యంతరాలను ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్లు వెంటనే పరిష్కరించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు