TG News: సంఘాల నేతలైనా ఆరేళ్లకు కచ్చితంగా బదిలీ

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో తమను మార్చవద్దని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు పైరవీలు చేస్తూ ప్రభుత్వ శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.

Updated : 09 Jul 2024 02:56 IST

వారు ఏ పదవిలో ఉన్నా స్థానచలనం తప్పనిసరి 
ప్రభుత్వ జీవోలో స్పష్టం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో తమను మార్చవద్దని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు పైరవీలు చేస్తూ ప్రభుత్వ శాఖాధిపతులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. హైదరాబాద్, వరంగల్‌లాంటి నగరాల్లో 18-20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా తమను బదిలీ చేయవద్దని సంఘాల పదవుల పేరుతో గట్టిగా కోరుతుండటం గమనార్హం. కానీ, బదిలీల కోసం రాష్ట్ర ఆర్థికశాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం... ఒకేచోట ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ తప్పనిసరిగా తాలూకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి. వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు లేదు. ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో 2012లో వెలువడిన ప్రభుత్వ సర్వీసు ఉత్తర్వుల్లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 

గుర్తింపు లేక పెద్ద సమస్య 

  • ప్రతి శాఖలో పలు రకాల పేర్లతో ఉద్యోగ సంఘాలున్నాయి. వీటిలో చాలా వాటికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వాటికి అధికారిక గుర్తింపు లభించలేదు. దాంతో తమకు ‘అధికారిక గుర్తింపు’ ఇవ్వాలని గతంలో వివిధ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. 
  • ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే కొన్ని సంఘాలు ‘తెలంగాణ’ అనే పేరుతో పని చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం అవతరించాక... అంతకుముందు నుంచి ‘తెలంగాణ’ పేరిట ఉన్న సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. మిగిలిన వాటి విషయంలో ఇంతవరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. 
  • ఉదాహరణకు వైద్య శాఖలోని అనేక సంఘాలు తమకు గుర్తింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేసిన హైకోర్టు... అన్నేసి సంఘాలు ఉండటానికి వీల్లేదని, అంతా కలసి ఒకే సంఘంగా ఏర్పడి నిబంధనల ప్రకారం కార్యవర్గాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుని ‘అధికారిక గుర్తింపు’ కోసం ప్రభుత్వాన్ని కోరాలని సూచించింది. ఈ మేరకు వైద్యులు ఇప్పటి వరకు జిల్లాస్థాయి ఎన్నికలను మాత్రమే పూర్తిచేశారు. రాష్ట్రస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోలేదు. దాంతో గుర్తింపు రాలేదు. 
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘంలోని నేతలనే... అది కూడా ఒకసారి మాత్రమే వరసగా ఆరేళ్లపాటు ఒకేచోట కొనసాగించే అవకాశముందని 2012లో ఇచ్చిన జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. అందులోని నిబంధన-2 ప్రకారం... వరసగా ఆరేళ్లపాటు ఒకచోట పనిచేశాక ఏ సంఘంలో ఏ పదవిలో ఉన్నా తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. 
  • నగరం, జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఆరేళ్ల సర్వీసు పూర్తయిన సంఘాల నేతలు మరో ప్రాంతానికి బదిలీ అయ్యాక... తాము సంఘంలో మరోసారి కొత్త పదవికి ఎన్నికయ్యామని చెబుతూ... కోరుకున్న కేంద్రాలకు బదిలీ అడిగే హక్కు లేదని 2012 జీవోలోని 3, 4 నిబంధనలు వివరిస్తున్నాయి. 
  • కొందరు ఉద్యోగులు తాము సంఘం నేతలమని చెప్పుకొంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి డిప్యుటేషన్‌ పేరిట మళ్లీ నగరాలు, జిల్లా కేంద్రాలకు వస్తున్నారు. ఇలా డిప్యుటేషన్‌లో ఉన్న సర్వీసును కూడా ఆరేళ్ల కింద పరిగణించాలని నిబంధనలు వివరిస్తున్నాయి. 

16 ఏళ్లుగా హైదరాబాద్‌లో.. కదిలించొద్దని ఒత్తిళ్లు 

ప్రభుత్వ గుర్తింపు లేకున్నా కొందరు ఉద్యోగులు తాము ఫలానా సంఘం కార్యవర్గంలో, ఫలానా పదవిలో ఉన్నట్లు చూపుతూ ఏకంగా 15-25 ఏళ్లుగా నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నారు. ఉదాహరణకు ఒక శాఖలోని సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగి ఒకరు... తనకు తాను సంఘం నేతనని చెప్పుకొంటూ 16 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా తనను బదిలీ చేస్తే ఊరుకునేది లేదని, తన పోస్టును ఇతరులెవరూ అడగొద్దని తమ శాఖలోని ఉద్యోగులను హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2012 ఉత్తర్వుల ప్రకారం చూసినా... ఆయన హైదరాబాద్‌లో ఆరేళ్లకు మించి ఉండటానికి వీల్లేదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని