TG News: కృష్ణ జింకలను పట్టుకోవాల్సిందే!

రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి.

Updated : 07 Jul 2024 08:03 IST

పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్న వైనం 
వాటిని బంధించేందుకు కార్యాచరణ
ముడుమాల్‌లో సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతి
తర్వాత ప్రాణహిత, సాగర్, మద్దిమడుగు ప్రాంతాలకు తరలింపు

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని పొలంలో సంచరిస్తున్న జింకలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కృష్ణా నదీ తీర మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని మాగనూరు, కృష్ణా, మక్తల్, ఊట్కూరు, నర్వ, దేవరకద్ర మండలాల పరిధిలో ఉన్న కృష్ణా నదీ తీరంలో మూడు వేల పైచిలుకు కృష్ణ జింకలున్నాయి. ఇవి పంటలకు నష్టం కలిగిస్తూ, అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలుత- నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌లో 74 ఎకరాల్లో సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. సమస్యలు సృష్టిస్తున్న జింకలను బంధించి, వాటిని కొన్నాళ్లు పునరావాస కేంద్రంలో ఉంచుతారు. తర్వాత దశలవారీగా ప్రాణహిత తీరం, నాగార్జునసాగర్, నల్లమల అడవుల్లోని మద్దిమడుగు ప్రాంతాల్లో విడిచిపెడతారు. కృష్ణ జింకలు మిగతా వన్యప్రాణుల్లా అడవుల్లో కాకుండా గడ్డిభూములు, పంటపొలాలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. సమీపంలోని పంటలపై ఆధారపడతాయి. వాటి నుంచి పంటల రక్షణకు రైతులు రాత్రి వేళల్లో పొలాల దగ్గర కాపలా ఉంటున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని గతంలో రైతులు ధర్నాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఓ అధ్యయనం చేయించింది. ప్రభావిత మండలాలు, గ్రామాల్లో పంటనష్టంపై కోయంబత్తూరుకు చెందిన నేచర్‌ కన్జర్వేషన్‌ ఎన్జీవో ‘సెకాన్‌’ నివేదిక ఇచ్చింది. తర్వాత ముడుమాల్‌ శివారులో 74 ఎకరాల భూమిని ప్రభుత్వం జింకల సంరక్షణ కేంద్రానికి కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు మంజూరు చేస్తూ.. తాజాగా పరిపాలన అనుమతులిచ్చింది. ఆ కేంద్రం చుట్టూ 8 అడుగుల ఎత్తుతో ఫెన్సింగ్‌ వేయనున్నారు. త్వరలో ఆ కేంద్రం పనులు మొదలవుతాయని ఓ అధికారి తెలిపారు. 

ప్రత్యేక పద్ధతిలో పట్టివేత

కృష్ణ జింకలు 100-150 కలిసి మందలుగా సంచరిస్తాయి. వేర్వేరు మండలాలు, గ్రామాల్లో కృష్ణ జింకలను పట్టి బంధించి సంరక్షణ కేంద్రానికి చేరుస్తారు. బోమా పద్ధతిలో వాటిని పట్టుకుంటారు. ప్రభావిత గ్రామాల్లో దశలవారీగా ‘వి’ అకారంలో 50-80 మీటర్ల పొడవుతో ఫెన్సింగ్‌ లింక్‌ ఏర్పాటు చేస్తారు. దీని లోపలికి వెళ్లే కొద్ది వెడల్పు తగ్గుతుంది. చివరిభాగం నుంచి ఎన్‌క్లోజర్‌లో బంధించి తరలిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని