Farmers Protest: ఆగిన రైతుల పోరు

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు ఎట్టకేలకు తమ ఇళ్లకు తిరిగి వెళ్లనున్నారు. వారి డిమాండ్లలో ముఖ్యమైన కొత్త సాగు చట్టాల రద్దును ఇప్పటికే

Updated : 10 Dec 2021 20:15 IST

రైతుల మహోద్యమం తాత్కాలిక విరమణ

సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటన

కేంద్రం హామీపత్రం అందిన వెంటనే నిర్ణయం

దిల్లీలోని సింఘు సరిహద్దులో గురువారం శిబిరాలను తొలగిస్తున్న అన్నదాతలు

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులు ఎట్టకేలకు తమ ఇళ్లకు తిరిగి వెళ్లనున్నారు. వారి డిమాండ్లలో ముఖ్యమైన కొత్త సాగు చట్టాల రద్దును ఇప్పటికే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మిగిలిన వాటి అమలుకూ లిఖితపూర్వకమైన హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు 40 రైతుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) గురువారం ప్రకటించింది. వాగ్దానాలను నెరవేర్చకుంటే మళ్లీ ఉద్యమిస్తామని రైతు నేతలు హెచ్చరించారు.

ఈ నెల 11వ తేదీ నుంచి దిల్లీలోని నిరసన శిబిరాలను ఖాళీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కొద్ది రోజుల సమయం పట్టవచ్చని రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ అభిప్రాయపడ్డారు. సింఘూ సరిహద్దులోని ఆందోళనకారులు తమ తాత్కాలిక నివాసాలను (శిబిరాలను) గురువారమే తొలగించడం ప్రారంభించారు.

విజయ కవాతులతో తిరుగుముఖం...

‘రైతులు చరిత్రాత్మక విజయం సాధించారు. ఈ నెల 11 నుంచి వారు విజయ కవాతు చేసుకుంటూ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తార’ని కర్షక నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ తెలిపారు. దిల్లీ సరిహద్దుల్లోని ఆయా శిబిరాల నుంచి ఇవి ప్రారంభమవుతాయన్నారు. నిరసనల సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రైతు నాయకుడు శివ్‌ కుమార్‌ కక్కా క్షమాపణలు చెప్పారు

అధికారిక హామీ పత్రం అందిన వెంటనే..

రైతుల నేతల డిమాండ్‌ మేరకు సవరించిన అధికారిక హామీ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం వారికి అందజేసింది. కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు సహా రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. ఈ విషయాలతో కూడిన హామీ పత్రం అందిన వెంటనే ఎస్‌కేఎం నేతలు సమావేశమై నిరసనల విరమణపై తుది నిర్ణయం తీసుకున్నారు. జనవరి 15న సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, ప్రభుత్వం హామీలను నెరవేర్చకుంటే నిరసనలు మళ్లీ కొనసాగిస్తామని రైతు నేత గుర్నాం సింగ్‌ స్పష్టం చేశారు.

గాజీపుర్‌ సరిహద్దులో గురువారం రైతుల సంబరాలు

కేంద్ర మంత్రి హర్షం

రైతుల నిరసనల విరమణ నిర్ణయంపై కేంద్ర మంత్రి సంజీవ్‌ బాల్యన్‌ హర్షం వ్యక్తం చేశారు. కర్షక సోదరులు స్వస్థలాలకు తిరుగుముఖం పట్టడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగా భాజపా ప్రచారానికి ఇక అవరోధాలు తొలగిపోయినట్లేనని పశ్చిమ యూపీకి చెందిన ఈ జాట్‌ నేత పేర్కొన్నారు. వేల మంది రైతుల ధర్నాలు, పోలీసుల చెక్‌పోస్టులు, వాహనాల మళ్లింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు తాజా పరిణామంతో ఊపిరిపీల్చుకున్నారు.


కేంద్ర ప్రభుత్వ లేఖలో ఏముంది?

రైతు నేతలకు కేంద్ర ప్రభుత్వం... వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ ద్వారా ఒక లేఖను పంపించింది. పెండింగ్‌ డిమాండ్లు అన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించినందున నిరసనలను నిలిపివేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం)కు ఆయన విజ్ఞప్తి చేశారు. సాగు చట్టాల రద్దు తర్వాత మిగిలిపోయిన అయిదు ప్రధాన డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.

1. పంటల మద్దతు ధరలను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో ప్రభుత్వ అధికారులు, నిపుణులతో పాటు ఎస్‌కేఎం సభ్యులకూ ప్రాతినిధ్యంపై హామీ

2. రైతులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాలు అంగీకరించాయి.

3. ఉద్యమంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు సమ్మతించాయి.

4. విద్యుత్తు సవరణ బిల్లులో రైతులపై ప్రభావం చూపే అంశాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు, సంబంధీకులతో చర్చించిన తర్వాతే పార్లమెంటులో ప్రవేశపెడతాం.

5. సాగు వ్యర్థాల దహనాన్ని నేరంగా పరిగణించడాన్ని ఇప్పటికే నిలిపివేశాం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని