kamareddy: రుణం చెల్లించలేదని రైతు పొలంలో ఫ్లెక్సీ

భూమి తనఖా పెట్టి తీసుకున్న దీర్ఘకాలిక రుణం చెల్లించలేదని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారులు రైతు పొలంలో ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకున్నామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 15 Jun 2024 06:39 IST

వేలం వేసేందుకు స్వాధీనం చేసుకున్నట్లు రాతలు
నిజామాబాద్‌ డీసీసీ బ్యాంకు లింగంపేట శాఖ ఎదుట అన్నదాతల ఆందోళన 

తనఖా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకున్నామంటూ బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, లింగంపేట: భూమి తనఖా పెట్టి తీసుకున్న దీర్ఘకాలిక రుణం చెల్లించలేదని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) అధికారులు రైతు పొలంలో ఎర్రజెండాలు పాతి స్వాధీనం చేసుకున్నామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేటకు చెందిన రైతు భూమిలో రెండు రోజుల కిందట నిజామాబాద్‌ డీసీసీబీ లింగంపేట శాఖ అధికారులు జెండాలు పాతి ఈ నెల 20న వేలం వేస్తామని నోటీసులు జారీ చేశారు. 2010లో స్థానిక డీసీసీ నుంచి రైతు రుణం తీసుకున్నారు. పంటలు పండక చెల్లించకపోవడంతో వడ్డీలతో కలిపి అప్పు రెండింతలైంది. బ్యాంకు సిబ్బంది నోటీసులు జారీ చేయడంతోపాటు భూమి స్వాధీనం చేసుకున్నామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. దీనిని నిరసిస్తూ అన్నదాతలు బ్యాంకు ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. వీరికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తోపాటు పలువురు భారాస నేతలు మద్దతు పలికారు.

లింగంపేట డీసీసీబీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు, భారాస నాయకులు


ఫ్లెక్సీ ఘటనపై మంత్రి తుమ్మల ఆగ్రహం
అలాంటి పద్ధతులు మానుకోవాలని బ్యాంకు అధికారులకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రుణం చెల్లించాలంటూ రైతుపొలంలో ఫ్లెక్సీలు కట్టడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పద్ధతులను మానుకోవాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పోల్కంపల్లి ఘటనపై మంత్రి బ్యాంకు అధికారులను ఆరాతీశారు. రైతుకు 2010లో దీర్ఘకాలిక రుణం మంజూరు చేశామని, గడువు 9 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత చెల్లించాల్సిందిగా అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసి పొలంలో ఫ్లెక్సీ పెట్టామని వివరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని