Foxconn: ఆగస్టులో ‘ఫాక్స్‌కాన్‌’ ఉత్పత్తులు షురూ!

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఉత్పత్తులను ప్రారంభించనుంది.

Published : 17 Jun 2024 04:28 IST

కొంగర కలాన్‌లో శరవేగంగా సాగుతున్న పనులు
తొలి ఏడాదిలో 25 వేల మందికి ఉద్యోగావకాశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఉత్పత్తులను ప్రారంభించనుంది. రూ.1,200 కోట్ల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్‌లో నెలకొల్పుతున్న ఉత్పత్తుల ప్లాంట్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఉత్పత్తులను తెలంగాణలో ప్రారంభించేందుకు సంస్థ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోందని పరిశ్రమల శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే పదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తొలి ఏడాదిలో సుమారు 25 వేల మంది ఉద్యోగావకాశాలు పొందుతారని తెలిపాయి. ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న దిగ్గజ సంస్థల్లో ‘ఫాక్స్‌కాన్‌’ ఒకటి. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన ఘనత ఈ సంస్థ సొంతం. ఇంతటి ప్రఖ్యాత సంస్థ నుంచి తొలి ఉత్పత్తులకు సమయం సమీపిస్తుండడం పట్ల పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ‘ఫాక్స్‌కాన్‌’ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. సంస్థ పనులు వేగవంతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని