TGRTC: దూర ప్రయాణాలకు ఎక్స్‌ప్రెస్‌లు దూరం!

రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు. పూర్తి టికెట్‌ కొనాల్సిన డీలక్స్‌ బస్సుల వైపు వారిని మళ్లించేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీలక్స్‌ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ప్రారంభించింది.

Updated : 23 Jun 2024 06:54 IST

అదనంగా డీలక్స్‌ బస్సులు ప్రవేశపెడుతున్న ఆర్టీసీ
ప్రయాణానికి కొన్నిచోట్ల బహుమతులతో ఆకర్షణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు. పూర్తి టికెట్‌ కొనాల్సిన డీలక్స్‌ బస్సుల వైపు వారిని మళ్లించేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీలక్స్‌ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ప్రారంభించింది. జనగామ డిపో హనుమకొండ-హైదరాబాద్‌ మార్గంలో మూడు డీలక్స్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గతంలో సగటున 70-75 శాతం వరకు మాత్రమే నమోదయ్యేది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక దాదాపు వంద శాతం ఉంటోంది. కేవలం ఎక్స్‌ప్రెస్‌ బస్సులనే తీసుకుంటే 120 శాతం దాటుతోంది. ఆర్డినరీతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి. బస్సు వేగం అధికం. ఆగే స్టాపులు, ప్రయాణ సమయమూ తక్కువ. దీంతో మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే అంశం ఆర్టీసీకి ఆర్థికంగా సమస్యగా మారింది. డీజిల్‌ సహా రోజువారీ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగులకు నెల జీతాలకు ఇబ్బంది అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మార్పులు చేస్తోంది.

దూరప్రాంత సర్వీసుల్ని రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు కొంతకాలం క్రితం అంతర్గత ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పలు అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశారు. జనగామ నుంచి బాసరకు 30 ఏళ్లుగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుంది. ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత బస్సులో రద్దీ భారీగా పెరిగింది. ఫిబ్రవరిలో జనగామ డిపో ఈ సర్వీసును రద్దు చేసింది. కరీంనగర్‌ నుంచి ఏపీలోని నరసరావుపేటకు సూర్యాపేట, మిర్యాలగూడ మీదుగా ఎక్స్‌ప్రెస్‌ ఉండేది. ఈ బస్సును రద్దుచేశారు. ప్రయాణికుల ఒత్తిడి పెరగడంతో ఇటీవల పునరుద్ధరించారు. మిర్యాలగూడ-మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్, కోదాడ-కర్నూలు ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. భూపాలపల్లి-గుంటూరు, పరకాల-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లనూ రద్దు చేసింది. 

‘సూర్యాపేట-జనగామ’కు ఆర్డినరీ బస్సులే

సూర్యాపేట నుంచి జనగామ మార్గం 365(బి) జాతీయరహదారిలో ఉంది. పైగా ఈ రెండూ జిల్లా కేంద్రాలు. కానీ రెండు డిపోల నుంచి 20 బస్సులు నిత్యం 40 ట్రిప్పులు తిరుగుతాయి. ఇవన్నీ ఆర్డినరీ బస్సులే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని