Published : 23 Sep 2020 04:23 IST

సంక్షోభంలో ఐరాస విశ్వసనీయత

సంస్కరణలు అత్యవసరం
సర్వప్రతినిధి సభలో ప్రధాని మోదీ

కాలం చెల్లిన వ్యవస్థలతో మనం నేటి సరికొత్త సవాళ్లను ఎదుర్కొనలేం. ప్రస్తుత వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఐరాసను సంస్కరించుకోవాలి. ఈ లక్ష్యం కోసం సభ్యదేశాలతో కలసి పనిచేయడానికి భారత్‌ సంసిద్ధంగా ఉంది.

-ప్రధాని నరేంద్ర మోదీ

ఐరాస: ఐక్యరాజ్య సమితి(ఐరాస) విశ్వసనీయత సంక్షోభంలో పడుతోందని, దాన్ని అధిగమించడానికి ఆ సంస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేటి పరస్పర అనుసంధాన ప్రపంచానికి సంస్కరణలతో కూడిన బహుపాక్షిక విధానం అత్యవసరమని, అది అన్ని సభ్య దేశాల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమకాలీన సవాళ్లను అధిగమిస్తూ, మానవాళి సంక్షేమానికి పాటుపడేలా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందులో మోదీ  వీడియో ద్వారా ప్రసంగించారు. వచ్చే జనవరి నుంచి రెండేళ్ల పాటు ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్‌ కొనసాగనున్న నేపథ్యంలో మోదీ దేశ ఆకాంక్షలను వినిపించారు. ఐరాస ఏర్పాటులో భారత్‌ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ ‘‘75 ఏళ్ల క్రితం యుద్ధ భయానక పరిస్థితుల్లో ఉన్న ప్రపంచానికి ఓ కొత్త ఆశాకిరణం కనిపించింది. మానవాళి చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ సంక్షేమం కోసం ఓ కొత్త వ్యవస్థ(ఐరాస) పురుడు పోసుకుంది. ఆ పవిత్ర లక్ష్యంలో భారత్‌ కూడా వ్యవస్థాపక భాగస్వామిగా ఉంది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని నమ్మే భారత్‌ ‘వసుధైక కుటుంబం’ సాధనకు కృషి చేసింది. ఐరాస వల్లే మన ప్రపంచం ఈరోజు ఉత్తమంగా ఉంది’’ అని మోదీ తెలిపారు. ఐరాస ద్వారా ఎన్నో సంక్షేమాలు సాధించినప్పటికీ దాని అసలు లక్ష్యాన్ని మాత్రం ఇంకా అందుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘సంఘర్షణలను నివారించడం, అభివృద్ధికి ఊతమివ్వడం, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం, అసమానతలను తొలగించడం, డిజిటల్‌ సాంకేతికతను పెంచడం తదితర లక్ష్యాల కోసం చేయాల్సిన కృషి ఇంకా ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు.

పాక్‌పై భారత్‌ మండిపాటు
ఈ సమావేశంలో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి తన ప్రసంగంలో జమ్మూ-కశ్మీర్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. ఖురేషి మాట్లాడుతూ ‘‘పాలస్తీనా, జమ్మూ-కశ్మీర్‌లు ఐరాసలో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాస్పద అంశాలు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు తమ స్వయం ప్రతిపత్తి విషయంలో ఐరాస ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుతుందా అని ఇంకా ఎదురుచూస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఐరాస వేదికపైనే భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘‘పాక్‌ ఉగ్రవాద కేంద్రమని ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి శిక్షణ ఇస్తున్నట్లు ఆ దేశమే స్వయంగా ఒప్పుకుంది. ఐరాసలో పూర్తికాని లక్ష్యం ఏదన్నా ఉందీ అంటే అది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, దాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి బుద్ధిచెప్ప
డం’’ అని భారత్‌ ఘాటుగా బదులిచ్చింది.

చైనానే జవాబుదారీ చేయాలి: ట్రంప్‌
ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 లక్షల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి విషయంలో చైనానే జవాబుదారీగా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఐరాసలో డిమాండ్‌ చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ మనం మరో ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నాం. కంటికి కనిపించని ‘చైనా వైరస్‌’పై యుద్ధం చేస్తున్నాం. అది 188 దేశాల్లో లక్షలాది మందిని కబళించింది. ఈ మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన చైనాను ఈ విపత్తుకు జవాబుదారీగా చేయాలి’’ అని ట్రంప్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

కోల్డ్‌ వార్‌, హాట్‌ వార్‌ ఏదీ మాకొద్దు: జిన్‌ పింగ్‌
చైనాకు సరిహద్దుల్లో భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలకు తోడు అమెరికా నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఐరాస సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మేం విస్తరణ వాదాన్ని, ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ‘‘మాకు ఏ దేశంతోనూ కోల్డ్‌ వార్‌ కానీ, హాట్‌ వార్‌ కానీ చేసే ఉద్దేశం లేదు. ఇతర దేశాలతో ఉన్న విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం’’ అని తన ప్రసంగంలో చెప్పారు.

ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపాలి: ఐరాస
ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న రెండు దేశాలు ప్రపంచాన్ని విడగొడుతుంటే భవిష్యత్తును ఊహించలేం అని ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాల మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భద్రతా మండలి నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణకు ఉమ్మడిగా కృషి చేయాలి. అందుకు 100 రోజులు గడువుగా నిర్ణయించాం. దీంతోపాటు కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆపాల్సిన అవసరముంది’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా టీకాలు తొలుత తమకే దక్కేలా కొన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నాలనూ గుటెర్రెస్‌ ఖండించారు. అలాంటి విధానాలు స్వీయ ఓటమిని కొనితెచ్చుకోవడమే అన్నారు. ఈ సమావేశంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనరొ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తదితరులు ప్రసంగించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని