పుల్వామా దాడి మా పనే: పాక్‌ మంత్రి

గత ఏడాది జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్‌ ప్రమేయం ఉందని...

Updated : 30 Oct 2020 09:59 IST

ఇస్లామాబాద్‌, దిల్లీ: గత ఏడాది జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్‌ ప్రమేయం ఉందని భారత్‌ వాదిస్తుండగా.. పాక్‌ బుకాయిస్తూ వస్తోంది. అయితే నాటి దుశ్చర్యలో తమ ప్రమేయం ఉందని పాక్‌ సీనియర్‌ మంత్రి ఒకరు తాజాగా ఆ దేశ పార్లమెంటులోనే అంగీకరించారు. ‘‘భారత భూభాగంలోకి వెళ్లి మరీ ఆ దేశంపై దాడి చేశాం. పుల్వామా దాడి.. ఇమ్రాన్‌ నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘన విజయం. మీరు.. మేమూ.. అందరం ఈ విజయంలో భాగస్వాములమే’’ అని పాక్‌ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి ఫవాద్‌ చౌధురి గురువారం జాతీయ అసెంబ్లీలో తెలిపారు. ఫవాద్‌.. ప్రధాని ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడు. అభినందన్‌ విడుదలకు ముందు పాక్‌ అగ్ర నాయకత్వం కాళ్లు వణికాయన్న విపక్ష నేత సాదిఖ్‌ వ్యాఖ్యలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.

పాక్‌ నాయకత్వానికి ముచ్చెమటలు!
అభినందన్‌ను పట్టుకున్నాక వణికిన ఇమ్రాన్‌ సర్కారు
బయటపెట్టిన ఆ దేశ విపక్ష నేత

కాళ్లు వణికిపోయాయి.. నుదిటిపై ముచ్చెమటలు పట్టాయి.! భారత్‌ తమపై ఎక్కడ విరుచుకుపడుతుందోనన్న భయం. గత ఏడాది యుద్ధవిమానం కూలి తమకు బందీగా పట్టుబడిన భారత వైమానిక దళ పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ భవితపై నిర్ణయం తీసుకోవడానికి నిర్వహించిన అత్యున్నతస్థాయి భేటీలో పాక్‌ నేతల పరిస్థితి ఇదీ. పాక్‌ విపక్ష నేత ఒకరు ఈ విషయాన్ని తెలిపారు.
ఈ అప్పగింతకు ముందు ఇస్లామాబాద్‌లో నెలకొన్న ఆందోళనను పీఎంఎల్‌(ఎన్‌) నేత, సర్దార్‌ అయాజ్‌ సాదిఖ్‌ తాజాగా పాక్‌ జాతీయ అసెంబ్లీలో బయటపెట్టారు. నాటి పరిణామాలపై ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు స్పందనను తప్పుబట్టారు. ‘‘అభినందన్‌ విడుదలకు ముందు ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అత్యున్నత స్థాయి భేటీకి ప్రధాని ఇమ్రాన్‌ డుమ్మా కొట్టారు. విదేశాంగ మంత్రి ఖురేషీ, సైన్యాధిపతి జనరల్‌ బజ్వా, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ), పీఎంఎల్‌-ఎన్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు సహా పలువురు అగ్రనాయకులు హాజరయ్యారు. ‘దయచేసి అభినందన్‌ను వదిలేయండి. లేదంటే ఈ రాత్రి 9 గంటలకు భారత్‌ మనపై దాడికి దిగుతుంది’ అని ఖురేషీ వాపోయారు. నిజానికి నాడు దాడికి భారత్‌ ఉపక్రమించలేదు. పాక్‌ నాయకత్వమే భారత్‌ ఎదుట మోకరిల్లి, అభినందన్‌ను అప్పగించింది’’ అని సాదిఖ్‌ విమర్శించారు.
అయితే తన వ్యాఖ్యలపై పాక్‌లో వివాదం చెలరేగడంతో సాదిఖ్‌ స్పందించారు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపించారు. అభినందన్‌ విడుదల ద్వారా పాక్‌ పౌర నాయకత్వం తన బలహీనతను చాటిందని చెప్పడమే తన ఉద్దేశమన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని