వీడని పీఠముడి

ఉత్కంఠ వీడలేదు. అనిశ్చితి తొలగిపోలేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. కీలకమైన మిషిగన్‌ను దక్కించుకోవడం ద్వారా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌ తాజాగా మరో 16 ఎలక్టోరల్‌ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అధ్యక్ష పీఠానికి మరింత చేరువయ్యారు. అయితే- ట్రంప్‌కూ ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి.

Published : 06 Nov 2020 05:16 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
డెమొక్రాట్ల వశమైన మిషిగన్‌
అధికారానికి 6 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో బైడెన్‌
ట్రంప్‌కూ మిగిలి ఉన్న విజయావకాశాలు
పెన్సిల్వేనియా కోర్టులో ఆయనకు అనుకూల తీర్పు
అమెరికా వ్యాప్తంగా ఉభయపక్షాల నిరసనలు

వాషింగ్టన్‌: ఉత్కంఠ వీడలేదు. అనిశ్చితి తొలగిపోలేదు. అమెరికా తదుపరి అధ్యక్షుడెవరన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. కీలకమైన మిషిగన్‌ను దక్కించుకోవడం ద్వారా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌ తాజాగా మరో 16 ఎలక్టోరల్‌ ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అధ్యక్ష పీఠానికి మరింత చేరువయ్యారు. అయితే- ట్రంప్‌కూ ఇంకా విజయావకాశాలు మిగిలే ఉన్నాయి. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతున్న రాష్ట్రాలన్నింటిలో విజయం సాధిస్తే.. అధ్యక్ష పదవిలో మరో నాలుగేళ్లపాటు ఆయనే కొనసాగుతారు.  దీంతో తుది ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికన్లతోపాటు యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు- ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతున్నవేళ అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. కౌంటింగ్‌ను నిలిపివేయాలంటూ ట్రంప్‌ అనుకూల వర్గాలు, ప్రతి ఓటునూ లెక్కించాలంటూ బైడెన్‌ అనుకూల వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించాయి. ఇక ఓట్ల లెక్కింపులో మోసం జరుగుతోందంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ట్రంప్‌కు పెన్సిల్వేనియా కోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. జార్జియా, మిషిగన్‌లలో మాత్రం చుక్కెదురైంది. బైడెన్‌ నెగ్గానని చెప్పుకొంటున్న అన్ని రాష్ట్రాల్లోనూ న్యాయ పోరాటం చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. పోలింగ్‌ ముగిసి రెండు రోజులవుతున్నా అమెరికా నూతన అధ్యక్షుడెవరో ఇంకా తేలలేదు. ఈ దఫా ఎన్నికల్లో 10 కోట్లకుపైగా పోస్టల్‌ బ్యాలెట్లు రావడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది. బుధవారం ఆధిపత్యం దోబూచులాడిన మిషిగన్‌ చివరకు డెమొక్రాట్ల సొంతమైంది. దీంతో బైడెన్‌ ఖాతాలోని ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 264కు పెరిగింది. ట్రంప్‌కు 214 ఓట్లున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు విషయంలో ట్రంప్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ‘కౌంటింగ్‌ను నిలిపివేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. మిషిగన్‌లో కౌంటింగ్‌ను నిలిపివేయాలంటూ ట్రంప్‌ బృందం బుధవారమే దావా దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. జార్జియాలోనూ కౌంటింగ్‌ను నిలిపివేసేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. నెవాడాలోనూ ట్రంప్‌ వర్గీయులు కోర్టును ఆశ్రయించారు. విస్కాన్సిన్‌లో రీకౌంటింగ్‌ నిర్వహించాలని వారు ఇప్పటికే కోర్టుకెక్కారు. విస్కాన్సిన్‌ రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రం. అక్కడ తాజాగా ట్రంప్‌కు 48.8% ఓట్లు రాగా, బైడెన్‌ 49.4% ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. ఇద్దరి మధ్య అంతరం 1% కంటే తక్కువగానే ఉంది కాబట్టి రీకౌంటింగ్‌ను కోరే హక్కు ట్రంప్‌నకు ఉందని న్యాయ నిపుణులు తెలిపారు. మరోవైపు ‘విశ్వాసముంచండి. మనం గెలవబోతున్నాం’ అని తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్‌ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక పారిస్‌ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరుతుందన్నారు.

పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌కు అనుకూల తీర్పు
కౌంటింగ్‌ను ఆరు అడుగుల దూరం నుంచి చూసేందుకు పార్టీలకు చెందిన ఎన్నికల పర్యవేక్షకులను అనుమతించాలంటూ కామన్‌వెల్త్‌ కోర్ట్‌ ఆఫ్‌ పెన్సిల్వేనియా తాజాగా ఆదేశించింది. బ్యాలెట్లను తెరిచి, లెక్కించే ప్రక్రియను దగ్గరి నుంచి పరిశీలించేలా పర్యవేక్షకులను అనుమతించకపోవడంపై ట్రంప్‌ బృందం తొలుత స్థానిక కోర్టును ఆశ్రయించింది. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడంతో పైకోర్టుకు వెళ్లిన సంగతి గమనార్హం. తాజా తీర్పుపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘పెన్సిల్వేనియాలో న్యాయపరమైన భారీ విజయం’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్‌ ముందంజలో ఉన్నా..లెక్కింపు సాగేకొద్దీ ఆయన ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇప్పటివరకూ పూర్తయిన కౌంటింగ్‌ను సమీక్షించేందుకూ తమకు అనుమతి వచ్చినట్లేనని ట్రంప్‌ బృందం తెలిపింది. పెన్సిల్వేనియాలో బ్యాలెట్ల లెక్కింపులో జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టునూ ట్రంప్‌ కోరినట్లు వార్తలొస్తున్నాయి.
* అమెరికాలో నెలకొన్న పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. అగ్రరాజ్యాధినేతగా ఎవరు ఎన్నికైనా వారితో సత్సంబంధాలను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని చైనా స్పష్టం చేసింది.


ఆ 4 రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?

అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. 45 రాష్ట్రాల్లో ఫలితాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. నెవాడా, నార్త్‌ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, అలస్కాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ ఐదే అగ్రరాజ్య తదుపరి అధినేత ఎవరో తేల్చబోతున్నాయి. మూడు ఎలక్టోరల్‌ ఓట్లున్న అలస్కాలో బైడెన్‌పై ట్రంప్‌ భారీ ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఆయన విజయం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది.మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది.
నార్త్‌ కరోలినా: పోలైన ఓట్లలో 95% లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతానికి బైడెన్‌ (48.7%)పై ట్రంప్‌ (50.1%)ది పైచేయిగా ఉంది. ఈ నెల 12 వరకూ ఇక్కడ పోస్టల్‌ బ్యాలెట్లను స్వీకరించనున్నారు. కాబట్టి అభ్యర్థుల మధ్య అంతరం స్వల్పంగానే కొనసాగితే.. తుది ఫలితం తేలేందుకు ఇంకొన్ని రోజులు పడుతుంది. రాష్ట్రంలో 15 ఎలక్టోరల్‌ ఓట్లున్నాయి.
పెన్సిల్వేనియా: 89% ఓట్ల లెక్కింపు పూర్తయింది. బైడెన్‌ (48.2%)పై ట్రంప్‌ (50.5%) ఆధిక్యంలో ఉన్నారు. 20 ఎలక్టోరల్‌ ఓట్లున్న ఈ రాష్ట్రంలో శుక్రవారం కల్లా కౌంటింగ్‌ దాదాపుగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.
నెవాడా: సాధారణ ఓట్లతోపాటు 86% పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయింది. ట్రంప్‌ (48.7%)పై బైడెన్‌ (49.3%) ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 6 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకుంటారు.
జార్జియా: ఇక్కడ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. దాదాపు 96% ఓట్ల లెక్కింపు పూర్తవగా, బైడెన్‌పై ట్రంప్‌ కేవలం 0.4% ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలోని ఎలక్టోరల్‌ ఓట్ల సంఖ్య 16.


పెల్లుబికిన నిరసనలు

లితాలపై అనిశ్చితి కొనసాగుతున్నవేళ అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. ‘ప్రతి ఓటునూ లెక్కించాలి’ అని నినదిస్తూ న్యూయార్క్‌లో డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుదారులు ఆందోళనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధులు ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్‌ హాలు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము వీధుల్లోకి వచ్చినట్లు వారు తెలిపారు. ట్రంప్‌ వెళ్లిపోవాలన్న డిమాండ్‌తో షికాగోలో భారీఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. ఒరేగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. మిన్నియాపొలిస్‌, మాన్‌హటన్‌లలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లికన్లకు పట్టున్న అరిజోనాలో బైడెన్‌ గెలవడంతో ట్రంప్‌ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ‘వుయ్‌ లవ్‌ ట్రంప్‌’ అంటూ నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని