కొవిషీల్డ్‌ టీకాపై దుమారం

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) రూపొందించిన కరోనా టీకా ప్రయోగ పరీక్షపై దుమారం చెలరేగింది.

Updated : 30 Nov 2020 06:26 IST

చెన్నైవాసి ఆరోపణపై సీరం సంస్థ ఖండన
రూ.100 కోట్లకు దావా వేస్తామని ప్రకటన

చెన్నై: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) రూపొందించిన కరోనా టీకా ప్రయోగ పరీక్షపై దుమారం చెలరేగింది. ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ వల్ల తన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడిందని క్లినికల్‌ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వాలంటీరు ఆరోపించగా.. వాటిని సీరం సంస్థ ఖండించింది. దీనిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఈ ఆరోపణలపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) దర్యాప్తు చేపట్టింది.

చెన్నైకి చెందిన 40 ఏళ్ల బిజినెస్‌ కన్సల్టెంట్‌ తరఫున ఈ నెల 21న ఆయా సంస్థలకు నోటీసులు పంపారు. అందులోని అంశాల ప్రకారం.. ‘‘కొవిషీల్డ్‌పై సీరం సంస్థ నిర్వహిస్తున్న మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో బాధితుడు పాల్గొన్నాడు. అక్టోబర్‌ 1న అతడికి శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థలో ఇతనికి టీకా వేశారు. మొదటి 10 రోజులు ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదు. ఆ తర్వాత తీవ్ర తలనొప్పి, వాంతులు వంటివి తలెత్తాయి. చుట్టూ ఏం జరుగుతోందో గ్రహించలేని స్థితికి అతడు వచ్చాడు. వ్యవహారశైలి కూడా మారింది. దీంతో అక్టోబర్‌ 11న అతడిని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో చేర్చారు. మాట్లాడలేని, ఎవరినీ గుర్తించలేని స్థితిలోకి అతడు జారిపోయాడు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గత నెల 26న అతడిని డిశ్ఛార్జి చేశారు. ఇంటి వద్ద అతడు కొన్నిసార్లు స్థితిభ్రాంతిలో ఉంటున్నాడు. అతడి మెదడు దెబ్బతింది. ఈఈజీ పరీక్షల్లో ఈ విషయం తేలింది. టీకా కారణంగానే అతడికి ఈ పరిస్థితి తలెత్తిందని అన్ని పరీక్షలూ నిర్ధారించాయి. బాధితుడు అనారోగ్యంపై నెల తర్వాత కూడా ఎవరూ స్పందించలేదు. ఆ వ్యాక్సిన్‌ ఆయా సంస్థలు చెబుతున్నంత సురక్షితం కాదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లోగా రూ.5కోట్ల పరిహారాన్ని చెల్లించాలి. టీకా ప్రయోగం, ఉత్పత్తి, పంపిణీని ఆపాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. సీరం సంస్థతోపాటు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాల విభాగం అధిపతి ఆండ్రూ పొలార్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలోని జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆస్ట్రాజెనెకా, శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు నోటీసులు పంపారు.

డీసీజీఐ దర్యాప్తు
బాధితుడిలో తలెత్తిన ఆరోగ్య సమస్యలకు కొవిషీల్డ్‌ టీకాతో ఏదైనా సంబంధం ఉందా అన్నది నిర్ధారించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ), వ్యాక్సిన్‌ ప్రయోగం జరిగిన చోటు ఉన్న సంస్థాగత నైతిక విలువల కమిటీ దర్యాప్తు చేపట్టాయి. తీవ్రస్థాయి దుష్ప్రభావాలపై నిర్దేశిత శాస్త్రీయ విధానాల ప్రకారం నిర్దేశిత కాలావధిలోగా నిష్పాక్షిక మదింపు జరగడం ఆనవాయితీ అని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)లోని అంటువ్యాధుల విభాగాధిపతి సమీరన్‌ పాండ చెప్పారు. హడావుడిగా విచారణ చేయడం, ఒక నిర్ధారణకు రావడం సరికాదన్నారు. ప్రస్తుతం డీసీజీఐ దీనిపై దృష్టి సారించిందని చెప్పారు.

ఖండించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌
తమ టీకా వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు వచ్చిన ఆరోపణలను సీరం సంస్థ ఖండించింది. దురుద్దేశంతో ఈ ఆరోపణలు చేశారని, దీనిపై రూ.100 కోట్లకుపైగా పరిహారాన్ని కోరుతూ దావా వేస్తామని స్పష్టంచేసింది. ‘‘బాధితుడి ఆరోగ్యంపై సానుభూతితో ఉన్నాం. అయితే అతడి పరిస్థితికి టీకాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని వైద్య బృందం విస్పష్టంగా అతడికి చెప్పింది. అయినా అతడు బహిరంగంగా తప్పుడు విమర్శలు చేస్తూ.. మా సంస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు’’ అని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు