బెంగాలి మావైపే

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో భారీ కుదుపు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత సువేందు అధికారి సహా.. వివిధ పార్టీల నాయకులు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలో భారీగా చేరారు.  ఆరుగురు తృణమూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, బర్ధమాన్‌ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న

Updated : 20 Dec 2020 05:57 IST

సువేందు సహా 10 మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిక
2021లో అధికారం మాదే
200 సీట్లకు పైగా గెలుస్తాం
అమిత్‌ షా ధీమా
చివరకు తృణమూల్‌కు మిగిలేది మమత ఒక్కరేనని వ్యాఖ్య
కోల్‌కతా, ఖరగ్‌పూర్‌ - న్యూస్‌టుడే

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో భారీ కుదుపు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత సువేందు అధికారి సహా.. వివిధ పార్టీల నాయకులు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలో భారీగా చేరారు.  ఆరుగురు తృణమూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, బర్ధమాన్‌ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎంపీ సునిల్‌ మండల్‌ కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సీపీఐ. సీపీఎం, కాంగ్రెస్‌ నుంచి ఒక్కో ఎమ్మెల్యే భాజపాలో చేరడం విశేషం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వలసలు.. బెంగాల్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా నందిగ్రామ్‌ ఉద్యమంతో పేరు తెచ్చుకున్న సువేందు అధికారి భాజపాలో చేరడం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్‌ పార్టీకి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. జంగల్‌ మహల్‌ ప్రాంతంలో సువేందు కుటుంబానికి దాదాపు 35 నుంచి 40 నియోజకవర్గాల్లో పట్టుంది. సువేందు తండ్రి శిశిర్‌ అధికారి, సోదరుడు దివ్యేందు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు. ఇంకో దగ్గరి బంధువు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతానికి పార్టీ మారనప్పటికీ.. వెనుక నుంచి సువేందుకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవికి సువేందు రాజీనామా చేసినప్పుడు.. అతన్ని పార్టీలో ఉంచేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రయత్నించారు. అందుకే శనివారం జరిగిన మిద్నాపుర్‌ సభలో ‘‘తృణమూల్‌ నుంచి నాయకులు వీడుతున్న వేగం చూస్తుంటే ఎన్నికల సమయానికి పార్టీలో మమత ఒక్కరే ఒంటరిగా మిగులుతారేమో’’ అని షా అన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 200పైగా సీట్లతో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు, 27 ఏళ్లు కమ్యూనిస్టులకు. పదేళ్లు తృణమూల్‌కు అధికారమిచ్చిన బెంగాల్‌ ప్రజలు.. భాజపాకు ఓ ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌ను సోనార్‌ బంగ్లా (బంగారు బంగ్లా)గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


చక్రం తిప్పిన షా

మమతా బెనర్జీ తర్వాత కీలకమైన నేతగా భావించే సువేందును పార్టీలోకి తీసుకురావడంలో అమిత్‌షా కీలక పాత్ర వహించారని బెంగాల్‌ భాజపా వర్గాలు చెబుతున్నాయి. సువేందు కూడా తాను కొవిడ్‌-19కు గురైనపుడు సొంత పార్టీ వ్యక్తులు పట్టించుకోకపోయినా, షా తనను ఆత్మీయంగా పలకరించారని చెప్పారు. ‘‘నేను తొలిసారి 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో అమిత్‌ షాను కలిశాను. తర్వాత కొవిడ్‌-19 సోకినప్పుడు సొంత పార్టీ నాయకులే పట్టించుకోలేదు. అమిత్‌ షా రెండు సార్లు ఫోన్‌ చేశారు. నా బాగోగులు తెలుసుకున్నారు’’ అని మిద్నాపుర్‌ సభలో సువేందు చెప్పారు.


రైతు ఇంట్లో భోజనం

రెండు రోజల పర్యటన కోసం శనివారం కోల్‌కతా చేరుకున్న అమిత్‌ షా ఉదయం స్వామి వివేకానంద పుట్టిన ప్రదేశాన్ని దర్శించారు.అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరాం బోస్‌ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం మిద్నాపుర్‌లో బెలిజూరి గ్రామంలోని సనాతన్‌ సింగ్‌ అనే రైతు ఇంట్లో భోజనం చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts