మళ్లీ అమెరికను చేయాలని

మనవలు... మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడిపే వయసులో... జో బైడెన్‌ అమెరికా పునరుద్ధరణ భారం మోయబోతున్నారు! 46వ అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసే 78 ఏళ్ళ బైడెన్‌- ఉపాధ్యక్షురాలుగా

Published : 20 Jan 2021 05:52 IST

మనవలు... మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడిపే వయసులో... జో బైడెన్‌ అమెరికా పునరుద్ధరణ భారం మోయబోతున్నారు! 46వ అమెరికా అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణం చేసే 78 ఏళ్ళ బైడెన్‌- ఉపాధ్యక్షురాలుగా నల్లజాతి కలువ కమలా హారిస్‌తో కలసి అమెరికాను మళ్ళీ గాడిన పెట్టడానికి... ట్రంప్‌ హయాంలో అమెరికాపై ఇంటా బయటా పడ్డ మరకల్ని కడిగేయటానికి... నడుంబిగిస్తున్నారు. ఆ క్రమంలో ఎదురవుతున్న సవాళ్ళెన్నో!


ఇంట...

కొవిడ్‌: ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని, మళ్లీ సాధారణ పరిస్థితులను నెలకొల్పడం.
ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు 2.46 కోట్ల మంది అమెరికన్లు కరోనా బారిన పడగా... వీరిలో 4 లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

వర్ణ వివక్ష: ప్రజల శరీర రంగు ఆధారంగా సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన నలుపు-తెలుపు జాతి వివక్ష (సిస్టమిక్‌ రేసిజం)ను రూపుమాపడం.
ఎన్నికలకు కొద్దినెలల ముందు జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు దారుణంగా హింసించి, ఆయన మృతికి కారణమవడంతో ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి డెమొక్రాట్లు మద్దతు పలికారు.

పారిస్‌ ఒప్పందం:  పారిస్‌ వాతావరణ ఒప్పందంలో మళ్లీ భాగస్వామిగా మారి, కాలుష్యాన్ని కట్టడి చేయడం.
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న ఉద్గారాలను కట్టడి చేయడం దీని లక్ష్యం. కీలకమైన ఈ ఒడంబడికలో అమెరికా తిరిగి చేరేలా చర్యలు తీసుకుంటామని బైడెన్‌ హామీ ఇచ్చారు. అయితే ఇందుకు భారీ మొత్తంలో నిధులు సమకూర్చాల్సి ఉంది.

ఆర్థిక పరిపుష్టి: తిరోగమనంలో కూరుకుపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పరిపుష్టం చేసి, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించడం.
ఓవైపు కరోనా మహమ్మారిని నియంత్రించడం... మరోవైపు సగటు ప్రజలు, నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు బైడెన్‌ కొద్దిరోజుల కిందటే 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.

ఏకీకరణ: డెమొక్రాటిక్‌, రిపబ్లిక్‌ అన్న తేడా లేకుండా ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను, వాటి మద్దతుదారులందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి... తను నినాదమిచ్చినట్టు దేశాన్ని మళ్లీ అగ్రగామిగా నిలబెట్టడం.
తాను ఒక వర్గానికి మాత్రమే అధ్యక్షుడిగా ఉండబోనని, అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని బైడెన్‌ ప్రకటించారు.


బయట...

ముస్లిం వలసలు
ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలసలపై ట్రంప్‌ సర్కారు ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఆంక్షలను ఎత్తివేస్తామని, తాను విభజించే అధ్యక్షుడిని కాదని బైడెన్‌ చెబుతున్నారు. ఇదే జరిగితే, వలసల ముసుగులో దేశంలోకి వచ్చే ఉగ్రవాదులను కట్టడి చేయడం డెమొక్రాటిక్‌ సర్కారుకు సవాలుగా మారుతుంది.

సెనెట్‌లో...
ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా బైడెన్‌ వ్యవహరించడం మరీ అంత సులభం, సత్వరం కాకపోవచ్చు. ఎందుకంటే దిగువసభలో తీసుకున్న నిర్ణయాలను.. సెనెట్‌లో   బలం బాగానే ఉన్న రిపబ్లికన్లు అడ్డుకునే అవకాశముంది. ప్రతి అంశాన్నీ వారు లోతుగా చర్చించే అవకాశముంది.

చైనాతో ఎలా..?
బైడెన్‌కు అత్యంత కఠిన పరీక్ష... చైనాతో వ్యవహారమే! ట్రంప్‌ హయాంలో అమెరికా-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. డొనాల్డ్‌ ఓటమితో ఊపిరి పీల్చుకున్న డ్రాగన్‌ దేశం... అగ్రరాజ్యంతో సత్సంబంధాల కోసం తహతహలాడుతోంది. కానీ, ఇది అనుకున్నంత సులభం కాదు. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు చైనా వస్తువులపై ట్రంప్‌ విధించిన సుంకాలను భారీగా తగ్గించడం కుదరకపోవచ్చు. దక్షిణ చైనా జలాల్లో ఆ దేశ ఆధిపత్యాన్ని నిలువరించాల్సిన సవాలు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ అంశాల్లో చైనాతో కలిసి ముందుకు వెళ్లడం బైడెన్‌కు పెద్ద సవాలే.


భారత్‌తో బంధం

మెరికా అధ్యక్షునిగా బైడెన్‌ ఎన్నిక ఖాయం కాగానే ప్రధాని మోదీ ఆయనకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే భారత విదేశీ వ్యవహారాలశాఖ, బైడెన్‌-కమలా హారిస్‌ బృందం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి.
భారత్‌-అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందనీ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం, టీకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు... దేశ, విదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలో కలిసి పనిచేస్తామని డెమొక్రాటిక్‌ వర్గాలు ప్రతినబూనాయి. జమ్మూ-కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి (ఆర్టికల్‌ 370) రద్దు, పౌరసత్వ సవరణ చట్టం తీసుకురావడం, ఎన్జీవో సంస్థలపై ఆంక్షలు విధించడం వంటి మోదీ ప్రభుత్వ నిర్ణయాలపై బైడెన్‌-హారిస్‌లు గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘విదేశాల్లో ప్రజాస్వామ్య పరిపుష్టికి కృషి చేస్తా’మని బైడెన్‌ బృందం చెప్పడం మోదీ సర్కారుకు కాస్త ఇబ్బందికర పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘మోదీ జంటిల్‌మాన్‌, నా మిత్రుడు’ అంటూ ట్రంప్‌ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో... బైడెన్‌ సర్కారుతో భారత్‌ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రపంచ భద్రత, ఉగ్రవాదం, ప్రాంతీయ విభేదాలు, వాణిజ్యం వంటి అంశాల్లో కలిసి పనిచేస్తామని ఉభయ దేశాలు చెప్పడం ఆనవాయితీ. కానీ, వీటి కంటే రెండు దేశాలకూ ప్రధాన ముప్పుగా మారిన కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికే నేతలిద్దరూ ప్రాధాన్యమివ్వడం విశేషం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ అనుకూల వైఖరిని బైడెన్‌ సర్కారు అనుసరిస్తుందా? అన్నదీ వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని