Updated : 22 Jan 2021 12:02 IST

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఐదుగురు ఒప్పంద కార్మికుల మృతి

పుణె: కరోనా టీకా.. కొవిషీల్డ్‌ను తయారు చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన పుణెలోని మంజరీ ప్రాంగణంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. తొమ్మిది మందిని ప్రమాదస్థలి నుంచి అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్లాంట్‌లోని నాలుగైదు అంతస్తుల్లో మధ్యాహ్నం 2.45 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి  చేరుకొని మంటలను నియంత్రణలోకి తెచ్చారు. కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. భవనంలో జరుగుతున్న వెల్డింగ్‌ పనుల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సీరం సంస్థ రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. కొవిషీల్డ్‌ టీకా ఉత్పత్తిపై ఈ ప్రమాదం ఎలాంటి ప్రభావం చూపదని సీరం సంస్థ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను సీరం సంస్థ ఈ మంజరీ ప్రాంగణం నుంచే దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ప్రమాద ప్రాంతానికి.. టీకా ఉత్పత్తి కేంద్రాలు కిలోమీటర్‌ దూరంలో ఉన్నాయని సీరం సీఈవో అదర్‌ పూనావాలా చెప్పారు. ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగదని ప్రభుత్వానికి, ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని ట్విటర్‌లో తెలిపారు.

దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
సీరంలో ప్రమాదంపై పుణె మున్సిపల్‌ కమిషనర్‌తో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రమాదస్థలిని సందర్శించనున్నారు.  ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు.

ప్రధాని దిగ్భ్రాంతి
సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని