తూర్పు లద్దాఖ్‌లో చైనా వంచన!

చైనా మరోసారి వంచనకు పాల్పడింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి స్వయంగా ప్రతిపాదించిన ఒక సూచనను తానే ఉల్లంఘించింది.

Published : 25 Jan 2021 04:30 IST

హామీని గాలికొదిలేస్తూ అదనపు మోహరింపులు
క్షేత్ర పరిశీలనలో వెల్లడి
దీటుగా చర్యలు చేపడుతున్న భారత్‌

దిల్లీ: చైనా మరోసారి వంచనకు పాల్పడింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి స్వయంగా ప్రతిపాదించిన ఒక సూచనను తానే ఉల్లంఘించింది. ఆ ప్రాంతంలో తన మోహరింపులను పెంచింది. ఘర్షణలకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల్లో తన స్థితిని మరింత పటిష్ఠం చేసుకుంది. దీంతో భారత్‌ కూడా దీటుగా ప్రతిస్పందిస్తోంది.
తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటంతో కొద్ది నెలల కిందట రెండు దేశాలూ అక్కడికి భారీగా బలగాలను తరలించిన సంగతి తెలిసిందే. మరిన్ని మోహరింపులకు దిగకుండా సంయమనం పాటిద్దామంటూ చైనా సైన్యం గత ఏడాది సెప్టెంబరు 21న జరిగిన చర్చల్లో భారత్‌కు ప్రతిపాదించింది. ఆ భేటీ అనంతరం వెలువడిన ఉమ్మడి ప్రకటనలోనూ దాని ప్రస్తావన ప్రముఖంగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదని అందులో రెండు దేశాలూ పేర్కొన్నాయి. తాజాగా పరిశీలనలు జరిపినప్పుడు డ్రాగన్‌ మోసం బట్టబయలైంది. ఇచ్చిన మాటకు తూట్లు పొడుస్తూ.. బలగాలను చైనా పెంచిందని స్పష్టమైంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ పనిని చక్కబెట్టేసినట్లు వెల్లడైంది. ఫలితంగా.. రెండు దేశాలు విశ్వాసాన్ని పాదుగొల్పేందుకు ఉద్దేశించిన కీలక ప్రతిపాదన నిష్ప్రయోజనంగా మారిందని మన సైనిక వర్గాలు తెలిపాయి. డ్రాగన్‌కు దీటుగా తామూ క్రమంగా మోహరింపులను పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వివరించాయి. సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో భారత సైన్యం ముందస్తు చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో.. అక్కడ పెను శీతల వాతావరణం నెలకొన్నప్పటికీ రెండు దేశాల బలగాలు, ట్యాంకులు, సాయుధ శకటాలు పరస్పరం చాలా దగ్గరకు వచ్చేశాయి.
* తూర్పు లద్దాఖ్‌లోని దెప్సాంగ్‌ మైదాన ప్రాంతాల్లో తన స్థితిని గత సెప్టెంబరు నుంచే చైనా బలోపేతం చేసుకుంటోంది.
* దౌలత్‌ బేగ్‌ ఓల్డీకి సమీపంలోనూ కొత్తగా చైనా మోహరింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా ఇటీవల ఇక్కడి వైమానిక స్థావరాన్ని సందర్శించి, రక్షణ ఏర్పాట్లను సమీక్షించారు. చైనా జోరుకు కళ్లెం వేసేందుకు భారత్‌ ఈ కీలక సెక్టారుకు పెద్ద సంఖ్యలో సైనికులను తరలించింది.
* రెండు దేశాల మధ్య 9వ విడత సైనిక చర్చలకు వేదికైన లద్దాఖ్‌లోని చుషుల్‌ సెక్టార్‌లో ఇప్పుడు భారత పదాతి దళం, ప్రత్యేక బలగాలు, ట్యాంకు దళాల ఆధిపత్యం ఉంది.
* తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణకు కేంద్రబిందువుగా కొన్ని ప్రాంతాల్లో చైనాకు వ్యూహాత్మకంగా పైచేయి ఉంది. అయితే భారత సైన్యం చేపట్టిన ప్రతిచర్యలతో డ్రాగన్‌కు చాలావరకూ ముకుతాడు పడింది. భారత సైన్యం ప్రదర్శిస్తున్న రాజీలేని ధోరణి వల్ల చైనా అంచనాలు ఎప్పటికప్పుడు దెబ్బతింటున్నాయి.
* మరోవైపు సిక్కింలోని ‘నాకు లా’ ప్రాంతంలో చైనా శాశ్వత రక్షణ నిర్మాణాలు చేపట్టి, యథాతథ స్థితికి విఘాతం కలిగిస్తోంది. ఇక్కడ భారత సరిహద్దులకు అత్యంత దగ్గర్లో భారీస్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని