కేంద్రం కన్నెర్ర

రైతుల ఆందోళన కారణంగా దిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది. పెద్దఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి,

Updated : 28 Jan 2021 13:43 IST

 దిల్లీ ఘటనలపై 25 క్రిమినల్‌  కేసులు.. నిర్బంధంలోకి 200 మంది
  టికాయత్‌, యోగేంద్ర సహా 37 మంది నేతలపై ఎఫ్‌ఐఆర్‌
  ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి
  1న పార్లమెంటుకు పాదయాత్ర రద్దు
  పోరాటాన్ని ఆపేది లేదు: రైతు నేతలు
 సరిహద్దులో యథావిధిగా నిరసనలు  

దిల్లీ: రైతుల ఆందోళన కారణంగా దిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది. పెద్దఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి, ఎర్రకోటపై జెండాలు ఎగరేయడం, అనంతర పరిణామాలకు సంబంధించి 25 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. సుమారు 200 మందిని పోలీసులు నిర్బంధంలో తీసుకున్నారు. రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌, యోగేంద్ర యాదవ్‌, మేధాపాట్కర్‌, దర్శన్‌పాల్‌, గుర్నాంసింగ్‌ చాదుని సహా 37 మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దిల్లీ సరిహద్దుల్లోని దీక్షా స్థలాలకు రైతులు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. దీంతో సింఘు సరిహద్దులో మళ్లీ హడావుడి మొదలైంది. ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. హింసకు తాము కారణం కాదని కర్షక నేతలు మరోసారి తేల్చిచెప్పారు. ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు.
విధ్వంసకారులపై పోలీసుల దృష్టి
హింసాత్మక ఘటనలకు కారకులను గుర్తించడంపై దిల్లీ పోలీసులు దృష్టి సారించారు. సీసీటీవీ దృశ్యాలను, వీడియోలను జల్లెడ పడుతున్నారు. హింసకు కారకులపై కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శాంతియుతంగా ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామని, రైతునేతలు దానికి భిన్నంగా వ్యవహరించారని దిల్లీ పోలీసు కమిషనర్‌ ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవ చెప్పారు. తాము అత్యంత సంయమనం పాటించడం వల్ల ఏ ఒక్కరికీ ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు. కొందరు నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తిందన్నారు. ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మంగళవారం నాటి ఘటనల్లో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయని గుర్తించారు. అనుమతి లేకుండా లుట్యెన్స్‌ ప్రాంతంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసినందుకు ఒక ఎఫ్‌ఐఆర్‌; బ్యారికేడ్లను ధ్వంసం చేసి, బస్సును ఢీకొట్టి, పోలీసు సిబ్బందిపైకి ట్రాక్టర్లను నడపాలని ప్రయత్నించారంటూ మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యాయి. ఆందోళనకారుల చేతుల్లో 394 మంది పోలీసులు గాయాలపాలైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటనలపై నాయకుల పాత్ర గురించి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. అల్లర్లకు పాల్పడడం (సెక్షన్‌ 147, 148), హత్యాయత్నం  (సెక్షన్‌ 307), నేరపూరిత కుట్ర (120బి) వంటి సెక్షన్ల కింద నేతలపై కేసులు పెడుతున్నారు.
 భద్రత పెంపు
సమస్యాత్మకంగా మారిన దిల్లీలో పలుచోట్ల భద్రత బలగాలను మరింతగా మోహరించారు. ముఖ్యంగా ఎర్రకోట, రైతుల ఉద్యమ ప్రదేశాల్లో పారామిలిటరీ బలగాలను పెంచారు. కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ఎర్రకోటను సందర్శించారు. పాక్షికంగా దెబ్బతిన్న మెటల్‌ డిటెక్టర్‌ ద్వారం, టికెట్‌ కౌంటర్‌ వంటివి పరిశీలించారు. కట్టడానికి కలిగిన నష్టంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దిల్లీలో అంతర్జాల సమస్య దృష్ట్యా ఎవరైనా న్యాయవాదులు వీడియో విచారణకు గైర్హాజరైతే వారు వాదించాల్సిన కేసుల్లో ప్రతికూల ఉత్తర్వులు ఇవ్వవద్దంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేను ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌-ఆన్‌-రికార్డ్‌ అసోసియేషన్‌’ కోరింది.
పార్లమెంటుకు పాదయాత్ర వాయిదా
హింస తలెత్తిన నేపథ్యంలో ఆందోళన నుంచి వైదొలగుతున్నట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌(భాను), అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ప్రకటించాయి. తాజా పరిస్థితుల్లో.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సమర్పణ నాడు జరపతలపెట్టిన ‘పార్లమెంటుకు పాదయాత్ర’ వాయిదా వేయాలని నేతలు నిర్ణయించారు. 30న దేశవ్యాప్తంగా సభలు, నిరాహార దీక్షలు కొనసాగించనున్నారు. నటుడు దీప్‌ సిద్ధు వంటి ‘‘సంఘ వ్యతిరేక శక్తులు’’ శాంతియుత ఆందోళనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని, పోరాటాన్ని నీరుగార్చాలని ఎవరు ప్రయత్నించినా ఫలించబోవని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ఎర్రకోట ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఘటనకు ప్రధాన బాధ్యులుగా భావిస్తున్న ఇద్దరికి నోటీసు పంపినట్లు సమాచారం.
సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు
రైతుల ఆందోళనలో అల్లర్లపై సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిషన్‌ను నియమించి విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హింసకు కారకులైన వారందరిపైనా కేసుల నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని దీనిని దాఖలు చేసిన న్యాయవాది విశాల్‌ తివారీ కోరారు. తగిన ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ప్రకటించవద్దంటూ మీడియాను ఆదేశించాలని మరొకరు పిటిషన్‌ వేశారు. రైతుల పేరుతో రోడ్లపై బైఠాయించినవారిని తొలగించి, రాకపోకలకు వీలు కల్పించాలంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎర్రకోట వద్ద విధి నిర్వహణలో విఫలమైన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌దారుడు కోరారు.
హరియాణాలో 2000 మందిపై కేసు
చండీగఢ్‌: దిల్లీలోకి బలవంతంగా ప్రవేశించే ఉద్దేశంతో బ్యారికేడ్లను బద్దలుగొట్టే యత్నం చేశారంటూ 2000 మంది వ్యక్తులపై హరియాణాలోని పల్వాల్‌ జిల్లాలో కేసు నమోదైంది. ట్రాక్టర్లను అతి ప్రమాదకరంగా వారు నడిపినట్లు పేర్కొన్నారు.Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు