Published : 30 Jan 2021 03:38 IST

కరోనాకు టీకానే ఆయుధం

దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు

ఈనాడు,హైదరాబాద్‌: కొవిడ్‌ ముప్పు ఇంకా తొలగిపోలేదని, దాని కట్టడికి మన ముందున్న ఏకైక ఆయుధం టీకానేనని ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా టీకాలపై కొందరు దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటివి నమ్మి అనవసర భయాందోళనలకు గురికావద్దన్నారు. టీకాలపై దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీకాలు వేయించుకోవడానికి ప్రైవేటు వైద్యసిబ్బంది ఆశించినరీతిలో ముందుకురాని నేపథ్యంలో.. ఈ విషయంపై చర్చించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి కోఠిలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో భారత వైద్యుల సంస్థ(ఐఎంఏ) ప్రతినిధులు, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నరేందర్‌రెడ్డి, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కిషన్‌రావు తదితరులతో కలిసి డీహెచ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ నిపుణులు కూడా మన దగ్గర లభిస్తున్న టీకాలు కొత్త రకం బ్రిటన్‌ వైరస్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోగలవని స్పష్టం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్ల మంది టీకాలు తీసుకున్నారని, ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదన్నారు. ఒళ్లునొప్పులు, తలనొప్పి, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు కన్పించడం సాధారణమేనన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం స్ఫూర్తిదాయకం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 91.5 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాలు వేశామని, ఇది స్ఫూర్తిదాయకమని డీహెచ్‌ అన్నారు. 70 శాతానికి పైగా టీకాల పంపిణీ పూర్తయిన జిల్లాల జాబితాలో జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్‌, మెదక్‌, నారాయణపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌ గ్రామీణ, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయన్నారు. ఈ నెల 30న కూడా టీకాల పంపిణీ కొనసాగుతుందన్నారు. తిరిగి వచ్చే నెల 3, 4, 5, 6 తేదీల్లో అందజేస్తామని తెలిపారు. తామంతా టీకాలు పొందామని, అపోహలు వీడి అందరూ ఆ దిశగా ముందుకు రావాలని డాక్టర్‌ నరేందర్‌రెడ్డి, డాక్టర్‌ కిషన్‌రావు పిలుపునిచ్చారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని