మెట్రో సహృదయ స్పందన

కాసేపట్లో ఆగిపోయే గుండెను కాలంతో పోటీపడి తరలించిన విశేషమిది. మృత్యువుతో పోరాడుతున్న మరో వ్యక్తి హృదయ స్పందనను నిలబెట్టిన ఉదంతమిది.. జీవన్మృతుడి కుటుంబ ఔదార్యం, వైద్యుల సమయస్ఫూర్తి, హైదరాబాద్‌ మెట్రో అధికారుల స‘హృదయ’ స్పందన.. వెరసి ఒకరి జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. ఒక జీవన్మృతుడి గుండెను వేగంగా తరలించడానికి మంగళవారం ప్రత్యేకంగా మెట్రో రైలును నడిపి మానవత్వాన్ని చాటుకున్నారు.

Updated : 03 Feb 2021 11:22 IST

జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి గుండె తరలింపు
ఫలించిన వైద్యబృందం కృషి

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, మోత్కూరు: కాసేపట్లో ఆగిపోయే గుండెను కాలంతో పోటీపడి తరలించిన విశేషమిది. మృత్యువుతో పోరాడుతున్న మరో వ్యక్తి హృదయ స్పందనను నిలబెట్టిన ఉదంతమిది.. జీవన్మృతుడి కుటుంబ ఔదార్యం, వైద్యుల సమయస్ఫూర్తి, హైదరాబాద్‌ మెట్రో అధికారుల స‘హృదయ’ స్పందన.. వెరసి ఒకరి జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. ఒక జీవన్మృతుడి గుండెను వేగంగా తరలించడానికి మంగళవారం ప్రత్యేకంగా మెట్రో రైలును నడిపి మానవత్వాన్ని చాటుకున్నారు.

బ్రెయిన్‌డెడ్‌ అయిన యాదాద్రి జిల్లాకు చెందిన ఓ నిరుపేద హృదయాన్ని దానమిచ్చి.. బాధిత కుటుంబం దాతృత్వాన్ని చాటుకుంది. ఈ గుండెను మంగళవారం సకాలంలో నాగోలు స్టేషన్‌ నుంచి మెట్రో రైలులో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి వైద్యులు తరలించారు. నర్సిరెడ్డి(45) అనే వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆయన గుండెను తరలించేందుకు వైద్యులు తొలిసారి గుండె మార్పిడికి మెట్రో రైలు ద్వారా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానాకు గుండెను ఒక పెట్టెలో ఉంచి ప్రత్యేక రైలులో తరలించారు. ఈ సందర్భంగా ఇతర ప్రయాణికులను అనుమతించలేదు. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరిన మెట్రో... ఏ స్టేషన్‌లో ఆగకుండా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దాదాపు 27.5 కిలోమీటర్లు 16 స్టేషన్లు దాటి హృదయాన్ని మోసుకుంటూ 30 నిమిషాల్లో నిర్ణీత స్టేషన్‌కు రైలు చేరుకుంది. అక్కడి నుంచి మరో 10 నిమిషాల్లో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి పెట్టెను చేర్చారు. దాత నుంచి సేకరించిన గుండెను 4 గంటల్లోపే రోగికి అమర్చాలి. లేదంటే పనితీరు మందగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రి నుంచి గుండెను తరలించేందుకు రోడ్డు మార్గానికి బదులు వైద్యులు మెట్రో రైలును ఎంచుకున్నారు. ఫలితంగా 30-45 నిమిషాల వరకు విలువైన సమయం ఆదా అయిందని వైద్యులు చెప్పారు. అపోలోకు చెందిన సీనియర్‌ కార్డియోథొరాసిక్‌, ట్రాన్స్‌ప్లాంట్‌ అండ్‌ మినిమల్‌ యాక్సెస్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ.జి.కె.గోఖలే ఆధ్వర్యంలోని వైద్యులు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించారు.

హృదయమిచ్చి..  ప్రాణం నిలబెట్టి..
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డిది పేదకుటుంబం. ఈయనకు భార్య నిర్మల, ఇద్దరు కుమారులు శశికాంత్‌(12), శ్రీనాథరెడ్డి(9) ఉన్నారు. బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ధ్రువీకరించారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. ‘మీ భర్త ప్రాణాలు తిరిగి రాకపోయినా.. మరికొందరిని రక్షించవచ్చని’ వారు చెప్పడంతో నర్సిరెడ్డి భార్య నిర్మల ఇందుకు అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు. మిగతా అవయవాలను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించారు.

భగవంతుడు ఇచ్చిన అవకాశం
గ్రీన్‌ ఛానల్‌ ద్వారా మెట్రో రైలులో గుండెను తరలించడం ఇదే మొదటిసారి. గతంలో ఒక గర్భిణి కోసం వేళలు ముగిసిన తర్వాత కూడా అత్యవసరంగా కొత్తపేట నుంచి మియాపూర్‌ వరకు ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపి ఆ సంస్థ మానవతాదృక్పథాన్ని చాటుకుంది. ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ కేవీబీరెడ్డి స్పందిస్తూ ఒక ప్రాణం నిలబెట్టేందుకు తమకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామన్నారు. కామినేని, అపోలో ఆసుపత్రులు మహోన్నత ఉద్దేశంతో తమను అభ్యర్థించాయని... తాము అన్ని భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటూ ప్రత్యేక గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి రైలు ఆగకుండా నడిపామని చెప్పారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని