తెలంగాణపై బాధ్యత మరిచారు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని, అన్నింటా శీతకన్నేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ ...

Updated : 06 Mar 2021 11:44 IST

విభజన చట్టంలోని హామీలకు తిలోదకాలిచ్చిన కేంద్రం
ప్రశంసలే తప్ప రూపాయి అదనపు సాయం లేదు
బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా? హైదరాబాద్‌కు అర్హత లేదా!
సీఐఐ వార్షిక సదస్సులో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని, అన్నింటా శీతకన్నేస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆరోపించారు.అందుకే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొంతును గట్టిగా వినిపించాల్సిన అవసరం, సమయం వచ్చిందన్నారు. కేంద్రం పారిశ్రామికాభివృద్ధి, పరిశ్రమ అవసరాలకన్నా రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలకు కేంద్రం తిలోదకాలిచ్చిందని, ప్రాజెక్టులన్నింటిని ఎత్తగొడుతోందన్నారు. అనేక రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థల నుంచి పెట్టుబడులు సమీకరిస్తూ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నా ఏ మాత్రం ప్రోత్సాహం లేదన్నారు. రాష్ట్రం స్వయంసమృద్ధిని సాధిస్తుంటే కేంద్రం ప్రశంసలతో సరిపెడుతోందని, పన్నుల్లో వాటా తప్ప అదనంగా ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా? హైదరాబాద్‌కు అర్హత లేదా అని ప్రశ్నించారు. దిగుమతి సుంకాలు పెంచి, భారత్‌లో తయారీ అంటే లాభం ఉండదన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం  ఇస్తే సరిపోదని, దాని కోసం తగిన చర్యలు కూడా చేపట్టాలన్నారు. కేంద్రం ఎన్నికల కోసం కాకుండా.. ప్రజలు, దేశం కోసం పని చేయాలన్నారు.హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. ‘‘నవజాత శిశువు లాంటి తెలంగాణకు అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం ఆది నుంచి విస్మరించింది. 

ప్రపంచం మెచ్చినా...
గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామికాభివృద్ధి కార్యక్రమాలు, విధానాలను ప్రపంచం మొత్తం అభినందించింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదు. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. వరంగల్‌లో రైల్వే కోచ్‌ల కర్మాగారం ఏర్పాటు హామీకీ తిలోదకాలిచ్చింది. రాష్ట్రానికి ఒక్క పారిశ్రామిక కారిడార్‌ లేదు. బయ్యారం ఉక్కు ఊసేలేదు. ఎలక్ట్రానిక్‌ తయారీ సమూహాలు అడిగినా పట్టించుకోవడం లేదు. ఔషధనగరికి మౌలిక వసతుల కోసం రూ.3,900 కోట్లు అడిగితే వినడం లేదు. వరంగల్‌ జౌళిపార్కుకు సాయం లేదు. తాజాగా ప్రకటించిన 23 మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు దక్కలేదు.
ఎవరిని అడగాలి?
కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరిని అడగాలి? రాష్ట్రం నుంచే అధిక రెవెన్యూ తీసుకుంటూ అన్యాయం చేయడం దారుణం. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ రాష్ట్ర విధానాలను గుర్తించి సాయం అందించాలి’’ అని కేటీఆర్‌ కోరారు. సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు బి. కృష్ణ , మాజీ అధ్యక్షురాలు వనితా దాట్ల, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీసీఎంబీ సంచాలకుడు రాకేశ్‌ మిశ్రా, సీఐఐ ఉపాధ్యక్షుడు సమీర్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరితహారంలో చురుగ్గా పాల్గొన్న, స్ఫూర్తిదాయన కార్యక్రమాలు నిర్వహించిన పలు కార్పొరేట్‌, విద్యా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు పురస్కారాలను మంత్రి కేటీఆర్‌ అందజేశారు. కరోనాయోధులను కూడా సత్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని