పాలు కావాలి

రాష్ట్రంలో పాల కొరత అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న విజయ డెయిరీ కర్ణాటక నుంచి నిత్యం 50 వేల లీటర్ల పాలు కొంటోంది. ఈ డెయిరీకి రోజూ 3.80 లక్షల లీటర్ల పాలు

Published : 31 Mar 2021 02:43 IST

ఎండల తీవ్రతకు పడిపోయిన ఉత్పత్తి
మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున సేకరణ
పాలపొడిని పాలుగా మార్చి అమ్ముతున్న డెయిరీలు
ఉత్పత్తి, అమ్మకాలపై నియంత్రణలేకనే అవస్థలు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పాల కొరత అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న విజయ డెయిరీ కర్ణాటక నుంచి నిత్యం 50 వేల లీటర్ల పాలు కొంటోంది. ఈ డెయిరీకి రోజూ 3.80 లక్షల లీటర్ల పాలు అవసరం. అవి కూడా దొరక్కపోవడం, రాష్ట్రంలో ప్రైవేటు డెయిరీలు రేట్లు పెంచి స్థానికంగా పాలు కొంటుండటంతో వాటితో పోటీపడలేక విజయ డెయిరీ కర్ణాటక పాలపైనే ఆధారపడుతోంది. మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతున్నందున పలు డెయిరీలు పాలపొడిని పాలుగా మార్చి ప్యాకెట్లలో విక్రయిస్తున్నాయి. ఇప్పటికే 200 టన్నుల పాలపొడిని రాష్ట్రంలోని పలు డెయిరీలు కొన్నాయి. ఇంకా కొంటున్నాయి. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత కారణంగా పశువుల నుంచి పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. కానీ ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాల దిగుబడి బాగా తగ్గుతోందని విజయ డెయిరీ పరిశీలనలో తేలింది. కొరత నేపథ్యంలో విజయ డెయిరీ పాల సేకరణ ధరను ఇటీవల లీటరుకు రూపాయి చొప్పున పెంచింది. కానీ ప్రైవేటు డెయిరీలు రూ.4 నుంచి 5 వరకూ పెంచి కొంటున్నాయి. ప్రభుత్వ డెయిరీకి ఈ అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొంటోంది. అసలు తెలంగాణలో పాల ఉత్పత్తి ఎంత, అమ్మకాలు ఎంత అనే లెక్కలు ఎక్కడా పక్కాగా లేవు. పాల ఉత్పత్తి, అమ్మకాలపై వివరాల సేకరణకు గతంలో రాష్ట్ర ‘పాల కమిషనర్‌’గా విజయ డెయిరీ ఎండీ వ్యవహరించేవారు. అన్ని ప్రైవేటు డెయిరీలు ఈ కమిషనర్‌కే నెలకోమారు పాల సేకరణ, అమ్మకాల వివరాలు ఇచ్చేవి. దీనివల్ల రాష్ట్ర అవసరాలకు ఎన్ని పాలు అవసరం? కొరత ఎంత ఉందనేది పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రణాళికల తయారీకి అవకాశం ఉండేది. కానీ కమిషనర్‌ పోస్టును రద్దు చేసినందున ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు తనకు వివరాలు ఏమీ ఇవ్వడం లేదని ఎండీ శ్రీనివాసరావు తెలిపారు.


ప్రైవేటు డెయిరీలవైపే రైతుల మొగ్గు

జనగామ జిల్లా ఓబులకేశవాపురంలో మూతపడిన పాల సేకరణ కేంద్రం ఇది.  గ్రామంలోని 150 మందికి పైగా రైతులు విజయ డెయిరీ కోసం ఈ కేంద్రానికి రోజూ 300 లీటర్లకు పైగా పాలు తెచ్చి పోసేవారు. కానీ ధర గిట్టుబాటు కావడం లేదని మానేశారు. ఈ నెల 16న ఈ  కేంద్రాన్ని పూర్తిగా మూసేశారు. కొరత నేపథ్యంలో గ్రామంలోకి ఓ ప్రైవేటు డెయిరీ వచ్చి ధర బాగా పెంచింది. దాంతో రైతులంతా ఆ డెయిరీకే పాలు పోయడం ప్రారంభించారని ఈ చిత్రంలోని రైతు జనార్దన్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.


పాడి రైతులను పట్టించుకోవడం లేదు
-సోమిరెడ్డి, జనగామ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షుడు

మా జిల్లాలోని వనపర్తి గ్రామంలో గతంలో రోజుకు 1000 లీటర్లు ఉత్పత్తయ్యేవి. ఇప్పుడు 800 లీటర్లకు మించి రావడం లేదు. ఇలా వేసవిలో ఉత్పత్తి తగ్గి డిమాండు ఉన్నప్పుడు ప్రైవేటు డెయిరీలు పోటీపడి కొంటున్నాయి. వానాకాలంలో పాల ఉత్పత్తి పెరగగానే అవి ఇక్కడి రైతులను వదిలేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పాలను పెద్దఎత్తున తెస్తున్నందున పట్టించుకోవడం లేదు. ఇక్కడి రైతులకు ఏడాది పొడవునా ఒకే ధర ఇచ్చి కొనేలా ప్రభుత్వం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.


రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు
-ఆర్‌.రాములు, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర సహకార డెయిరీ మాజీ అధికారి

మాది ఖమ్మం జిల్లా. పాడి రైతులను ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. పూర్తిగా ప్రైవేటు డెయిరీలకే వదిలేయడం వల్ల రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగడం లేదు. సహకార డెయిరీలను ప్రోత్సహించి పాలకు గిట్టుబాటు ధర చెల్లిస్తే పాడి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని