పరీక్షల గండం దాటేదెలా?

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరిస్థితి ఈసారి అగమ్యగోచరంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఎట్టకేలకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై చదువులకు అలవాటుపడేలోపు  కరోనా కేసులు అధికమవుతున్నాయని విద్యాసంస్థలను మూసివేశారు.

Updated : 04 Apr 2021 09:02 IST

ప్రత్యక్ష తరగతులు లేకుండా కష్టం
పది, ఇంటర్‌ విద్యార్థులకైనా తరగతులను ప్రారంభించాలంటున్న నిపుణులు
పది పరీక్షలను జూన్‌కు వాయిదా వేసినా ఇబ్బంది లేదని సూచన
ఈనాడు - హైదరాబాద్‌

దో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల పరిస్థితి ఈసారి అగమ్యగోచరంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఎట్టకేలకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై చదువులకు అలవాటుపడేలోపు  కరోనా కేసులు అధికమవుతున్నాయని విద్యాసంస్థలను మూసివేశారు. కేవలం 40 రోజుల ప్రత్యక్ష తరగతులతోనే ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షలు జరుపుతారా? అన్న ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. మరో వైపు ఎంసెట్‌, జాతీయ ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ తదితర వాటిల్లో ర్యాంకుల ఒత్తిడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటర్‌ ప్రధాన పరీక్షలు మే 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, పదో తరగతి ప్రధాన పరీక్షలు మే 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయని గతంలోనే ఆయా బోర్డులు ప్రకటించాయి. ప్రత్యక్ష తరగతుల ద్వారా మాత్రం సిలబస్‌ సగం కూడా పూర్తికాలేదు. పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 మాత్రమే పూర్తయ్యింది. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఎఫ్‌ఏ-2ను ఏప్రిల్‌ 15వ తేదీలోపు పూర్తి చేయాలి. విద్యాసంస్థలను మూసివేసినందున దాన్ని ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఇక నెల రోజులు కూడా వ్యవధి లేదు. కేవలం 40 రోజుల చదువులతో పరీక్షలు రాయడం ఎలా అన్నది లక్షలాది సాధారణ విద్యార్థులను వెంటాడుతున్న ప్రశ్న.

ఇక సిలబస్‌ తగ్గించే అవకాశాలు లేవు
మే నెలలో వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని 70 శాతం సిలబస్‌తో...50 శాతం ఛాయిస్‌  ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఫలితంగా ఇక సిలబస్‌ తగ్గించే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే పరీక్షలు నిర్వహిస్తే 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. అందుకనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాల్సిందే. టెన్త్‌ పరీక్షలను జూన్‌కు వాయిదా వేయవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు. కొందరు అధికారులు కూడా అది మంచి ప్రతిపాదనేనని అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. ఈసారి 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లు (ఆరు పరీక్షలు) అయినందున జవాబుపత్రాల మూల్యాంకనాన్ని 10 రోజుల్లో పూర్తి చేయవచ్చని, చివరి పరీక్ష నుంచి 20 రోజుల్లో ఫలితాలు ఇవ్వొచ్చని అధికారి ఒకరు చెప్పారు.

ఇంటర్‌ విద్యార్థులకు ఏదీ మార్గం?
ఆన్‌లైన్‌ తరగతులతో ఇంటర్‌ పరీక్షలు జరిపినా మెరిట్‌ విద్యార్థులకు ఇబ్బంది ఉండదని, సగటు విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్ష తరగతులకు మళ్లీ విద్యాసంస్థలను తెరవకుండా మే 1 నుంచి వార్షిక పరీక్షలు జరపడం ఎక్కువ మందిని కలవరపెడుతోంది. ఇంటర్‌ ప్రధాన సబ్జెక్టు మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే పరీక్షలు తప్పనిసరి. వార్షిక పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తామని తాజాగా ఇంటర్‌బోర్డు ప్రకటించినందున ప్రస్తుతానికి మే 1వ తేదీ నుంచి రాత పరీక్షలు జరుగుతాయనే భావించాలి. ఇక ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ర్యాంకు వస్తుందో?రాదో? అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

టీకాలు వేగవంతం చేసి...తరగతులు నడపాలి
- ఆచార్య ఉపేందర్‌రెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ

ఈసారి కూడా అంతర్గత పరీక్షల ద్వారా వార్షిక పరీక్షల గ్రేడ్లు ఇవ్వడం మంచిది కాదు. కరోనా టీకాలు వేగవంతం చేయాలి. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు వాటిని శరవేగంగా ఇచ్చి... తరగతి గది బోధన ప్రారంభించొచ్చు. ఏపీలో మాదిరిగా జూన్‌కు పరీక్షలను వాయిదా వేయవచ్చు.

తరగతులు జరపకుండా పరీక్షలొద్దు
- జి.మల్లికార్జునశర్మ, రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు

ప్రత్యక్ష తరగతులు జరపకుండా, పాఠాలు బోధించకుండా వార్షిక పరీక్షలు జరపడం మంచిది కాదు. 6-8 తరగతులకు ప్రత్యక్ష పాఠాలు మొదలుపెట్టడమే పెద్ద పొరపాటు. ఇప్పటికైనా మళ్లీ కనీసం 10, ఇంటర్‌ తరగతులు ప్రారంభించాలి. ఈనెల 15 నుంచి పదో తరగతి వారినైనా పిలవాలి. పరీక్షలను జూన్‌ మూడు లేదా నాలుగో వారానికి వాయిదా వేయవచ్చు.

గణితంలో మార్కులు తగ్గే అవకాశం
- అభినవ్‌, ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థి

హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఈ ఏడాదిలో ఒక్కసారే రసాయనశాస్త్రంలో ప్రయోగాలు చేశా. 80 శాతం సిలబస్‌ మాత్రమే పూర్తిచేయగలిగాం. వార్షిక పరీక్షలకు సిద్ధమైనా గణితంలో వంద శాతం మార్కులు సాధించే అవకాశం  లేకుండా పోయింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్ర విద్యార్థులమే వాట్సప్‌ గ్రూప్‌గా ఏర్పడి సందేహాలను తీర్చుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని