భారత్‌కు సాయపడండి

మహమ్మారి వైరస్‌ విజృంభణతో భారత్‌లో వైద్య సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతూ సంక్షోభంలో చిక్కుకుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌ పేర్కొంది. అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న దేశాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం కదలిరావాలని తాజా సంచిక(మే 14)లో ‘ఎ కాల్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌’ పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో

Updated : 15 May 2021 05:05 IST

అంతర్జాతీయ సమాజానికి లాన్సెట్‌ జర్నల్‌ పిలుపు
కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై 8 సూచనలు చేసిన నిపుణుల బృందం

ఈనాడు, దిల్లీ: మహమ్మారి వైరస్‌ విజృంభణతో భారత్‌లో వైద్య సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతూ సంక్షోభంలో చిక్కుకుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌ పేర్కొంది. అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న దేశాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం కదలిరావాలని తాజా సంచిక(మే 14)లో ‘ఎ కాల్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌’ పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో లాన్సెట్‌ నిపుణులబృందం పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ముందుకొచ్చి కరోనా సంక్రమణాన్ని అష్ట దిగ్బంధనం చేయాలని పేర్కొంది. భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్‌తో పొరుగు దేశాలకూ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. మానవతా దృష్టితో కొవిడ్‌ కట్టడికి కలిసిరావాలని, పెద్ద ఎత్తున వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చడమే కాకుండా నిపుణుల సేవలను, నిరుపేదలకు ఆహారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ 8 సూచనలు చేసింది.  
1.అత్యవసరంగా భారత్‌లో వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేయాలి. పెద్ద సంఖ్యలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, టీకాలు, నాణ్యమైన పీపీఈ కిట్లు, పరీక్ష కిట్లు విరాళంగా ఇవ్వాలి.   దేశంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంపుతో పాటు ఆక్సిజన్‌ రవాణాకు అవసరమైన వస్తువులను పంపించాలి. అవసరమైన వారిని ఇంట్లోనే ఏకాంత వాసంలో ఉండేలా ప్రోత్సహించడానికి పేదలు, మురికివాడల్లో నివసించే వారికి పల్స్‌ ఆక్సీమీటర్లు, నాణ్యమైన మాస్కులు, ఆహారం, ఆర్థిక చేయూత అందించాలి.
2. అధిక మొత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవడానికి అంతర్జాతీయ సమాజం తోడ్పడాలి. మిగులు కొవిడ్‌ టీకాలను కలిగి ఉన్న ధనిక దేశాలు వాటిని భారత్‌కు పంపించాలి. వ్యాక్సిన్లకు సంబంధించిన అన్ని మేధోసంపత్తి హక్కులను రద్దు చేయాలి. ముడిసరకుల సరఫరాకున్న అవరోధాలను తొలగించాలి. టీకాల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్నీ బదిలీ చేయాలి. మేధో సంపత్తి హక్కులను అమెరికా రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం.
3. పరీక్షలు పెంచడానికి, వైరస్‌ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి అంతర్జాతీయ సమాజం మద్దతివ్వాలి. ప్రజలు ఇంట్లోనే పరీక్షలు చేసుకొనేలా టెస్టు కిట్లు, మొబైల్‌ వ్యాన్లను అందించడం ఎంతో అవసరం. ప్రస్తుతం బి.1.617, బి.1.1.7 రకం వైరస్‌లు భారత్‌లో విస్తరిస్తున్నందున వాటి జన్యు పరిణామక్రమ విశ్లేషణను పెంచాల్సి ఉంది. ఇందుకోసం పరిశోధన, విద్యా సంస్థలు, లేబొరేటరీలు ముందుకొచ్చి సాయపడాలి.
4. భారత్‌లోని వైద్యులు, వైద్య సహాయకులు నిరంతరంగా పనిచేస్తూ అలసిపోయారు. ఇలాంటి సమయంలో వారికి సాయం అందించేలా సుశిక్షితులైన సిబ్బందిని జోడించడం చాలా ముఖ్యం. టెలీమెడిసిన్‌, టెలీమానిటరింగ్‌ నైపుణ్యంతో కొవిడ్‌ నియంత్రించే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం తమ సేవలను విస్తరించి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించవచ్చు.
5.. అంతర్జాతీయ సమాజం స్థానిక ప్రభుత్వాలతో కలిసి మౌలిక వసతులపరంగా మద్దతు ఇవ్వొచ్చు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల ఏర్పాటు, ఐసోలేషన్‌, క్వారెంటైన్‌ సెంటర్లను అభివృద్ధిచేయడానికి, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ చర్యలను మెరుగుపరచడానికి సహాయం అందించవచ్చు. మానవతా సంస్థలు వైద్య సిబ్బందిని భారత్‌కు పంపి రోగులకు సేవలందించేలా చూడాలి. గుర్తింపు పొందిన సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన విదేశీ వైద్య నిపుణులు భారత్‌లో పనిచేసేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేయాలి.
6. వ్యాక్సిన్లు, జనరిక్‌ మెడిసిన్లు, యాంటీరెట్రోవైరల్స్‌, టీబీ మందుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌  ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్నందున ప్రపంచ దేశాలకు వాటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందువల్ల అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి భారత్‌కు చేయూతనందించి అత్యవసర మందుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సాయం చేయాలి. లేదంటే ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాల రోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
7.. భారత్‌లో ప్రబలిన కొవిడ్‌ దక్షిణాసియాకూ విపత్తుగా పరిణమించింది. అందువల్ల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, భారత్‌ నుంచి తిరిగి వచ్చే వారికి తప్పనిసరిగా క్వారెంటైన్‌ అమలుచేయడం ద్వారా సరిహద్దు దేశాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.  
8.. భారత్‌లో కొవిడ్‌ను అరికట్టడానికి శాస్త్రీయ ఆధారిత చర్యలు తీసుకోవడానికి అంతర్జాతీయ నేతలు కలిసి పనిచేయాలి. కొవిడ్‌ కేసులు, మరణాలు కచ్చితంగా నమోదయ్యేలా చూడాలి. మరణానికి కారణాలు, ఏ సమయంలో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉంది అన్న వివరాలను నమోదుచేయాలి. వైరస్‌ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యం. కేసులపై పర్యవేక్షణ, డేటా సేకరణ కోసం దీర్ఘకాల వ్యూహాలు అమలు చేయాలి. రీ ఇన్‌ఫెక్షన్‌ వివరాలు తెలుసుకోవడానికీ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సమస్యను విశ్లేషించి, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా వ్యూహాలు అమలు చేయడం కోసం పరిశోధకులకు డేటాను రియల్‌టైంలో అందుబాటులోకి తేవాలి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts