Updated : 22 May 2021 08:19 IST

Antibody test: రూ.75కే యాంటీబాడీ పరీక్ష!

డిప్కోవన్‌ కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీవో
జూన్‌ మొదటి వారంలో మార్కెట్లోకి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 యాంటీబాడీలను మాత్రమే గుర్తించే చౌక కిట్‌ను రక్షణ పరిశోధన అబివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. కొవిడ్‌ వైరస్‌ స్పైక్‌, న్యూక్లియోకాప్సిడ్‌ ప్రొటీన్లను 97 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తున్నట్లు పరీక్షల్లో తేలింది. డీఆర్డీవోకు చెందిన దిల్లీలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు దేశీయంగానే ‘డిప్కోవన్‌’ కిట్‌ను అభివృద్ధి చేశారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వెయ్యి మంది కొవిడ్‌ రోగులపై విస్తృతంగా పరీక్షించిన తర్వాత గత నెలలో ఐసీఎంఆర్‌ దీన్ని ఆమోదించింది. తాజాగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్లాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి ఆమోదం లభించడంతో కిట్ల తయారీకి, మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. 75 నిమిషాల వ్యవధిలోనే దీంతో పరీక్ష నిర్వహించవచ్చు. ఒక్కో పరీక్షకు అయ్యే వ్యయం రూ.75 వరకు అవుతుందని అంచనా. ఒక్కో కిట్‌తో వంద మందికి పరీక్షలు చేయవచ్చు. వీటిని జూన్‌ మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు వాన్‌గార్డ్‌ డయాగ్నస్టిక్స్‌ సంస్థతో డీఆర్డీవో ఒప్పందం చేసుకుంది. సమాజంలో కొవిడ్‌ వ్యాప్తిని తెలుసుకునేందుకు ఈ కిట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సరైన సమయంలో కిట్‌ను అభివృద్ధి చేయడంలో డీఆర్డీవో, పరిశ్రమల కృషిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ ప్రశంసించారు. చౌక ధరలో, అత్యంత కచ్చితత్వంతో, తక్కువ వ్యవధిలో యాంటీబాడీలను గుర్తించే కిట్‌ అభివృద్ధిలో పాల్గొన్న బృందాలను డీఆర్డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి అభినందించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts