Black Fungus: మోతాదుకు మించి  స్టిరాయిడ్ల వినియోగం

కొవిడ్‌ బారిన పడిన వారిలో ఇష్టారాజ్యంగా స్టిరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా తాము జరిపిన అధ్యయనంలో 63 శాతంమంది రోగుల్లో స్టిరాయిడ్లు అవసరానికి మించి ఇచ్చినట్లు

Updated : 27 May 2021 07:38 IST

6 ఎంజీకి బదులు 30 ఎంజీ వరకు ఇస్తున్నారు
బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణకు ఇదే ప్రధాన కారణం
నెలా రెండు నెలల్లో తగ్గే అవకాశం ఉంది
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ప్రొ. అరుణ్‌లోక్‌ చక్రవర్తి

ఎం.ఎల్‌.నరసింహారెడ్డి, ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌ బారిన పడిన వారిలో ఇష్టారాజ్యంగా స్టిరాయిడ్లు వాడటం వల్లే మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా తాము జరిపిన అధ్యయనంలో 63 శాతంమంది రోగుల్లో స్టిరాయిడ్లు అవసరానికి మించి ఇచ్చినట్లు తేలిందని చండీగఢ్‌లోని పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (పీజీఐ చండీగఢ్‌) ప్రొఫెసర్‌ అరుణ్‌లోక్‌ చక్రవర్తి తెలిపారు.

పీజీఐ చండీగఢ్‌లో మెడికల్‌ మైక్రోబయాలజీ విభాగాధిపతిగా ఉన్న అరుణ్‌లోక్‌ చక్రవర్తి ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పరిశోధనలు చేస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌పై 2017లోనే విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఆధ్వర్యంలోని యాంటీఫంగల్‌ రెసిస్టెన్స్‌ సర్వైలెన్స్‌ నెట్‌వర్క్‌కు అంతర్జాతీయ కో ఆర్డినేటరైన చక్రవర్తి ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఇవి..

ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్‌ తీవ్రరూపం దాల్చడానికి కారణమేంటి?
స్టిరాయిడ్స్‌ వాడకంలో సమతుల్యం లేకపోవడం ప్రధాన కారణం. దీనిపై తాజాగా దేశంలోని 16 కేంద్రాల్లో 350 మంది రోగులపై అధ్యయనం చేశాం. దీనిలో కొవిడ్‌ బాధితులకు విచక్షణరహితంగా స్టిరాయిడ్స్‌ ఇచ్చినట్లు గుర్తించాం. రోజుకు 6 ఎంజీ ఇవ్వాల్సి ఉంటే 30 ఎంజీ వరకు కూడా ఇచ్చారు. అవసరం లేనివారికీ వినియోగించారు. రెండో ముఖ్య కారణం రక్తంలో షుగర్‌ స్థాయిలు ఎక్కువగా ఉండటం. ఆశ్చర్యమేంటంటే చాలామందికి కొవిడ్‌ వచ్చాక చేసిన పరీక్షల్లోనే మధుమేహం ఉన్నట్లు తెలిసింది. సుమారు 25 శాతంమందిలో షుగర్‌స్థాయి 300 - 400 వరకు ఉండగా కొందరిలో కంట్రోల్‌ కాని స్థితికి వెళ్లింది. కొవిడ్‌ వల్ల ఆక్సిజన్‌ స్థాయి తగ్గి ఊపిరి తీసుకోవడంలో సమస్యలొచ్చాయి. అదే సమయంలో స్టిరాయిడ్స్‌ మోతాదుకు మించి ఇవ్వడంతో షుగర్‌ లెవల్స్‌ 600 నుంచి 800 వరకు పెరిగిన కేసులు కూడా ఉన్నాయి. అటు కొవిడ్‌ వల్ల, ఇటు స్టిరాయిడ్స్‌ వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. ఈ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ దాడి పెరిగింది. కొందరిలో ఐరన్‌, జీవక్రియలోనూ తేడాలొచ్చాయి ఇలాంటి పలు కారణాల వల్ల బ్లాక్‌ ఫంగస్‌ విజృంభించింది. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, హ్యుమిడిఫయర్స్‌ వల్ల ఫంగస్‌ పెరిగినట్లు ఎక్కడా తేలలేదు.

ఈ సమస్య మనదేశంలోనే ఎక్కువగా ఉందా?
మనదేశంలో ఇది అసాధారణమైందేమీ కాదు. సాధారణంగానే ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్‌లో ఈ కేసులు 70 రెట్లు ఎక్కువ. కొవిడ్‌కు ముందు లక్షకు 14 కేసులు వచ్చేవి. 2016 జనవరి నుంచి 2017 సెప్టెంబరు వరకు దేశంలోని 12 కేంద్రాల్లో 465 మంది రోగులపై అధ్యయనం చేశాం. ఇందులో 315 మందిలో అంటే 67.7 శాతంలో ఇది మామూలుగానే వచ్చింది. 62 శాతం మందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చింది. చాలామందిలో (73.5 శాతం) అప్పటికే మధుమేహం ఎక్కువగా ఉంది. ఇతర తీవ్ర సమస్యలతో బాధపడేవారూ ఉన్నారు. అధ్యయనం చేసిన రోగుల్లో 90 రోజుల్లో 242 మంది (52 శాతం) మరణించారు.

ఈ వ్యాధి ప్రధాన లక్షణాలేంటి? ఎప్పటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది?
ముఖంలో ఒకవైపు నొప్పి, వాయడం. ముక్కుకు అడ్డుపడటం, ముక్కులోంచి నల్లగా లేదా గోధుమ రంగు ద్రవం కారడం, పండ్లు వదులు కావడం ముందుగా కనిపించే లక్షణాలు. మెడికల్‌, సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ సంయుక్తంగా చేయాలి. 2017లో అధ్యయనం చేసినపుడు 82 శాతం రోగులకు యాంఫోటెరిసిన్‌-బి వాడారు. 465 మందిలో 107 మందికి సర్జరీలు చేశారు. కొందరు ఆసుపత్రి ఖర్చులు భరించలేక ముందుగానే వెళ్లిపోయారు. స్టిరాయిడ్‌ విచ్చలవిడి వినియోగం, మధుమేహం అదుపునకు చర్యలు తీసుకోనంత వరకు బ్లాక్‌ఫంగస్‌ ఉద్ధృతి కొనసాగుతుంది. ఇప్పుడు పలు ప్రత్యామ్నాయ మందులు వచ్చాయి. వైద్యులకు ఇప్పటికే ఈ సమస్య తీవ్రత అర్థమైంది కాబట్టి నెల, రెండు నెలల్లో కొంత తగ్గే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని