Corona Update: 2.11 లక్షల కేసులు.. 3,847 మరణాలు

దేశంలో కొత్తగా 2,11,298 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 3,847 మంది మృతి చెందారు. ఈ మేరకు గురువారం నాటికి మొత్తం

Updated : 28 May 2021 08:15 IST

 90% దాటిన కొవిడ్‌ రికవరీ రేటు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొత్తగా 2,11,298 కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 3,847 మంది మృతి చెందారు. ఈ మేరకు గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2,73,69,093కి పెరగ్గా.. ఇంతవరకు మొత్తం 3,15,235 మంది మహమ్మారికి బలైపోయారు. క్రితం రోజుతో పోలిస్తే కరోనా రోజువారీ కేసులు 1.3% మేర పెరగ్గా.. మరణాలు 7.45% మేర తగ్గాయి. రోజువారీ మరణాలు 4 వేల దిగువకు తగ్గడం గత వారం రోజుల్లో ఇది మూడోసారి.
దేశవ్యాప్తంగా బుధవారం 2,157,857 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరపగా పాజిటివిటీ రేటు 9.79%గా నమోదైంది. ఇది క్రితం రోజు కంటే (9.42%) ఎక్కువ. వారం సగటు పాజిటివిటీ రేటు 10.93%కి చేరింది. ఇంతవరకు మొత్తం 33,69,69,353 పరీక్షలు నిర్వహించారు.
ఒక్క రోజులో 2,83,135 మంది కోలుకున్నారు. వరుసగా 14వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. దీంతో రికవరీ రేటు 90.01%కి పెరిగింది. ఇంతవరకు 2,46,33,951 మంది కొవిడ్‌ను జయించారు.
క్రియాశీలక కేసులు ఒక్కరోజులో 75,684 తగ్గాయి. దీంతో వాటి మొత్తం సంఖ్య 24,19,907 (8.84%)కి తగ్గింది. అత్యధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ, దిల్లీల్లో మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల్లో ప్రతిరోజూ హెచ్చుతగ్గులు నమోదవుతూ వస్తున్నాయి.
రాష్ట్రాల వద్ద 1.84 కోట్ల టీకా డోసులు
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.84 కోట్లకు పైగా కొవిడ్‌ టీకా డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. 3 రోజుల్లో అవి మరో 11,42,630 డోసులు అందుకోనున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఇంతవరకు ఉచిత, రాష్ట్రాలు నేరుగా సేకరించే కేటగిరీల కింద 22,16,11,940 టీకా డోసులను సమకూర్చినట్లు తెలిపింది. ఇందులో 20,17,59,768 డోసులను (వృథా అయినవాటితో కలిపి) వినియోగించినట్లు పేర్కొంది.
జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
కొవిడ్‌తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించే ప్రతిపాదనకు కేంద్రం గురువారం ఆమోదం తెలిపింది. వీరికి రూ.5 లక్షలు వంతున అందించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈమేరకు మొత్తం 67 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నట్లు పేర్కొంది.

ఆ లెక్కలన్నీ తప్పుడు అంచనాలు
-  న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఖండించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ మరణాలపై ఇటీవల ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన ఓ కథనం నిరాధారమైందని కేంద్ర ప్రభుత్వం గురువారం తీవ్రంగా ఖండించింది. కొవిడ్‌ మరణాలను దాచిపెట్టడమన్న సమస్యే లేదని స్పష్టం చేసింది. అదంతా తప్పుడు సమాచారమని, వక్రీకరించిన అంచనాలతో ఆ కథనం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. న్యూయార్క్‌ టైమ్స్‌ ఆ కథనంలో.. భారత్‌లో కొవిడ్‌ మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయని పేర్కొంది. మూడు రకాల పరిస్థితులను అంచనా కడుతూ.. ఓ మోస్తరు విధానంలో 6 లక్షలు, మరో రకమైన పరిస్థితుల్లో 16 లక్షలు, మూడో రకం (అథమంగా) అంచనాలో 42 లక్షల మరణాలు ఉండొచ్చని పేర్కొంది. ఈ కథనం పూర్తిగా తప్పని, దీనికి ఎలాంటి ఆధారాల్లేవని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఖండించారు. దేశంలో మొత్తం కరోనా కేసులు, మరణాల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తున్నట్లు తెలిపారు. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనమంతా వక్రీకరించిన అంచనాలతో, తప్పులతో ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. కథనంలోని అంచనాలపై అంశాలవారీగా వివరణ ఇస్తూ అవన్నీ ఎలాంటి ప్రాతిపదిక లేకుండా వేసిన అంచనాలని ఖండించారు. వాటిని అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని