Lockdownపై ప్రజలు ఏమనుకుంటున్నారు?

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ నెల 30న మంత్రిమండలి సమావేశాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రులు

Updated : 28 May 2021 07:59 IST

జిల్లాల్లో ప్రభావం ఎలా ఉంది?
మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఫోన్‌లో సీఎం సంభాషణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీశారు. ఈ నెల 30న మంత్రిమండలి సమావేశాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు సీఎం స్వయంగా ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మీ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? లాక్‌డౌన్‌ ఎలాంటి ప్రభావం చూపింది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులను ఎలా చూస్తున్నారు? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను సీఎం అడిగారని తెలిసింది.
కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అదే రోజు మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఎజెండాలో లాక్‌డౌన్‌ కీలకం కావడంతో దాని గురించి మంత్రులు మహమూద్‌అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సమాచారం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగించాలా? ఆంక్షలేమైనా తొలగించాలా? ఇతర నిర్ణయాలపై సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సీఎం సూచించారు.

ప్రజల మనోభావాల మేరకే ముందుకు
రాష్ట్రంలో వానాకాలం పంటల సీజన్‌తో పాటు ప్రజలకు, సూపర్‌ స్ప్రెడర్లకు టీకాల కార్యక్రమం మొదలవుతున్నందున లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం కీలకమని, ప్రజల మనోభావాల మేరకే ముందుకుసాగుదామని ఈ సందర్భంగా సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ వర్గాలను సైతం పురమాయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 29కల్లా సీఎం కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని