INTER పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌

ఇంటర్‌మీడియట్‌ పాఠ్య పుస్తకాల్లో కూడా క్విక్‌ రెస్పాన్స్‌(క్యూఆర్‌) కోడ్‌ను ముద్రిస్తున్నారు. ఇప్పటివరకు 6-10 తరగతుల పాఠ్య పుస్తకాల్లోనే ఈ సౌలభ్యం ఉండగా దాన్ని ఇంటర్‌కూ విస్తరించారు. కాకపోతే ఇంటర్‌ పుస్తకాల్లో కోడ్‌ను స్కాన్‌ చేస్తే వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి.

Updated : 29 May 2021 08:27 IST

స్కాన్‌ చేస్తే టీశాట్‌ రూపొందించిన వీడియోలు
ప్రభుత్వ కళాశాలలకు సరఫరా చేసే సైన్స్‌ సబ్జెక్టుల్లో అమలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ పాఠ్య పుస్తకాల్లో కూడా క్విక్‌ రెస్పాన్స్‌(క్యూఆర్‌) కోడ్‌ను ముద్రిస్తున్నారు. ఇప్పటివరకు 6-10 తరగతుల పాఠ్య పుస్తకాల్లోనే ఈ సౌలభ్యం ఉండగా దాన్ని ఇంటర్‌కూ విస్తరించారు. కాకపోతే ఇంటర్‌ పుస్తకాల్లో కోడ్‌ను స్కాన్‌ చేస్తే వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రిస్తోంది. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల సబ్జెక్టుల్లోనే అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఆ కళాశాలల్లోని సైన్స్‌ గ్రూపుల విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ పుస్తకాలు అందుతాయి. దీనివల్ల దాదాపు లక్ష మంది ప్రయోజనం పొందుతారు. మరో వారం పది రోజుల్లో పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రించనుంది. ఇంటర్‌ విద్యాశాఖ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు అందిన తర్వాత కళాశాలలకు సరఫరా చేయనున్నారు.

ఒక్కో సబ్జెక్టుకు 80-90 వీడియో పాఠాలు
పాఠశాల తరగతుల పుస్తకాల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌లను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే పుస్తకంలోని అదనపు సమాచారం కనిపిస్తుంది. ఇంటర్‌ పుస్తకాల్లో మాత్రం సమాచారం కాకుండా వీడియోలు వస్తాయి. వాటిని మన టీవీ కోసం టీశాట్‌ తయారు చేసింది. ఒక్కో సబ్జెక్టుకు 80-90 వీడియో పాఠాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని