H1b: బోగస్‌ కంపెనీలు.. ఉత్తుత్తి ఉద్యోగాలు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వృత్తి నిపుణులుగా అమెరికా, ఇతర దేశాలకు వెళ్లేందుకు అవసరమైన హెచ్‌-1బీ వీసాలను ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌

Updated : 04 Jun 2021 09:51 IST

భారీగా హెచ్‌-1బీ వీసాల కుంభకోణం
హైదరాబాద్‌కు చెందిన ‘క్లౌడ్‌జెన్‌’ కన్సల్టెన్సీకి జరిమానా
అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారుల తనిఖీతో వెలుగులోకి..
మిలియన్‌ డాలర్ల జరిమానా, అయిదేళ్ల నిషేధం విధించిన హ్యూస్టన్‌ కోర్టు
ఈనాడు - హైదరాబాద్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వృత్తి నిపుణులుగా అమెరికా, ఇతర దేశాలకు వెళ్లేందుకు అవసరమైన హెచ్‌-1బీ వీసాలను ఇప్పిస్తామంటూ హైదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్న క్లౌడ్‌జెన్‌ సిస్టమ్స్‌ సంస్థ భారీగా అక్రమాలకు పాల్పడింది. అమెరికాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌ విభాగం అధికారులకు అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా.. ఈ కుంభకోణం వెలుగుచూసింది. 2013 మార్చి నుంచి 2020 డిసెంబరు వరకు క్లౌడ్‌జెన్‌ సంస్థ పదుల సంఖ్యలో వృత్తి నిపుణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు హెచ్‌-1బీ వీసాలు ఇప్పించినట్టు నిర్ధారణ కావడంతో టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ కోర్టు ఆరు రోజుల క్రితం క్లౌడ్‌జెన్‌ సిస్టమ్స్‌ సంస్థకు మిలియన్‌ డాలర్ల జరిమానా (భారత కరెన్సీలో రూ.7 కోట్లు), అయిదేళ్లపాటు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదంటూ నిషేధం విధిస్తూ తీర్పు ప్రకటించింది. తాము తప్పు చేశామంటూ క్లౌడ్‌జెన్‌ సిస్టమ్స్‌ ప్రతినిధి జోమన్‌ చక్కలక్కల్‌ కోర్టులో అంగీకరించారని ఫెడరల్‌ ప్రాసిక్యూటర్‌ జెన్నీఫర్‌ బి.లౌరీ తెలిపారు. హైదరాబాద్‌లో క్లౌడ్‌జెన్‌ సంస్థపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని సంస్థ మూసేసింది.

హైదరాబాద్‌.. మాన్సాస్‌.. కెనడా.. రొమేనియా..  
క్లౌడ్‌జెన్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యాలయాన్ని గచ్చిబౌలిలోని ది ప్లాటినియా భవనంలో కొన్నేళ్ల క్రితం ప్రవాసాంధ్రులు శశి పల్లెంపాటి, సందీప్‌ ప్రారంభించారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని మనాసస్‌తో పాటు కెనడా, రొమేనియా దేశాల్లోనూ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లేవారికి ఈ సంస్థ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థల ప్రాజెక్టులూ ఇస్తున్నామంటూ నిర్వాహకులు ప్రకటించుకున్నారు. ఇందులో విదేశీయులనూ భాగస్వాములను చేసుకున్నారు. వర్జీనియాలోని మనాసస్‌ నగరంలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శశి పల్లెంపాటి, సందీప్‌, సుసాన్‌ థామస్‌, ఎడ్వర్డ్‌ లార్డ్‌, నసీర్‌ సిద్దిఖీలు ఈ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.  

బోగస్‌ కంపెనీలు సృష్టించి..
అమెరికాకు వెళ్లేందుకు హెచ్‌-1బీ వీసాలు ఇప్పిస్తామంటూ ఎనిమిదేళ్ల క్రితం క్లౌడ్‌జెన్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులు ప్రకటించారు. సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో పెద్ద సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వృత్తి నిపుణులు వీరిని ఆశ్రయించారు. కెనడాతో పాటు అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఉన్నాయని, వాటిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, కమీషన్‌ ఇవ్వాలన్నారు. టెక్సాస్‌, వర్జీనియా, కెనడాల్లో బోగస్‌ కంపెనీలను సృష్టించారు. వాటిలో ఉద్యోగాలొచ్చాయంటూ పత్రాలతో అమెరికాకు పంపించడం మొదలుపెట్టారు. ఇలా ఏడేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వృత్తి నిపుణులను పంపించారు. వారి నుంచి సుమారు అయిదు లక్షల డాలర్లు కమీషన్‌గా పొందారు.

బెంచ్‌ అండ్‌ స్విచ్‌ కుంభకోణం..
అమెరికాలో అక్రమంగా ప్రవేశించి ఉద్యోగాలు పొందడాన్ని బెంచ్‌ అండ్‌ స్విచ్‌ కుంభకోణం అంటారు.
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వృత్తి నిపుణులు అమెరికాకు హెచ్‌-1బీ వీసాపై వెళ్లాలంటే అమెరికాలో ఉన్న సంస్థ, కంపెనీ ఉద్యోగం ఇస్తున్నట్టు నియామక పత్రం తప్పనిసరి. తొలుత మూడేళ్లు మాత్రమే అనుమతి ఉంటుంది.
క్లౌడ్‌జెన్‌ సిస్టమ్స్‌ సంస్థ ద్వారా అమెరికా వెళ్లాలనుకునేవారికి అక్కడి ఒక కంపెనీ పేరుతో (అక్కడున్న వారే సృష్టిస్తారు) ఉద్యోగం ఇస్తామంటూ నియామక పత్రం పంపిస్తుంది. దీని ఆధారంగా హెచ్‌-1బీ వీసాపై అక్కడికి వెళ్తారు. వాస్తవానికి అక్కడ ఉద్యోగం ఉండదు. దీన్నే ‘బెంచ్‌’ అంటారు.
ఉద్యోగాలు లేకుండా వెళ్లినవారిని ఇక్కడి నుంచి పంపించిన కన్సల్టెన్సీ ఇళ్లు, హోటళ్లలో కొద్ది రోజులు ఉంచుతుంది. ఆ సమయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వృత్తి నిపుణులు అమెరికన్‌ సంస్థలకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగం రాగానే ఉత్తుత్తి కంపెనీ ఇచ్చిన హెచ్‌-1బీ వీసాను అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి పంపిస్తారు. కొత్త సంస్థలో చేరినందున తమకు ఆ కంపెనీ తరఫున హెచ్‌-1బీ వీసా ఇప్పించాలని దరఖాస్తు చేసుకుంటారు. అలా అధికారికంగా హెచ్‌-1బీ వీసా సంపాదిస్తారు. దీన్నే ‘స్విచ్‌’గా వ్యవహరిస్తారు.
ఉత్తుత్తి కంపెనీలకు సంబంధించిన హెచ్‌-1బీ వీసాలను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తనిఖీ చేయడంతో క్లౌడ్‌జెన్‌ సంస్థ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని