Corona Vaccine: మరో 44 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్‌

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 44 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో 25 కోట్ల డోసులు కొవిషీల్డ్‌ కాగా, 19 కోట్ల డోసులు కొవాగ్జిన్‌. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య ఇవి అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం వెల్లడించారు.

Updated : 09 Jun 2021 09:40 IST

25 కోట్లు కొవిషీల్డ్‌, 19 కోట్లు కొవాగ్జిన్‌
ఆగస్టు-డిసెంబరు మధ్యలో అందుబాటులోకి 74 కోట్ల డోసులు
స్థోమత ఉన్నవారు పేదలకు టీకా ఖర్చును భరించవచ్చు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా 44 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో 25 కోట్ల డోసులు కొవిషీల్డ్‌ కాగా, 19 కోట్ల డోసులు కొవాగ్జిన్‌. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య ఇవి అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం వెల్లడించారు. బయోలాకల్‌-ఈ సంస్థకు ఇప్పటికే 30 కోట్ల డోసులకు ఆర్డర్‌ ఇచ్చామని, వీటితో కలిపి మొత్తం 74 కోట్ల డోసులు ఆగస్టు - డిసెంబరు మధ్య అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు వేసిన వాటితో కలిపి జులై చివరి నాటికి మొత్తం 53.6 కోట్ల డోసులు ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలకు అదనంగా 30% సొమ్ము అడ్వాన్సుగా విడుదల చేసినట్లు తెలిపారు. ఆయన చెప్పిన ఇతర వివరాలు..

ప్రాధాన్యంపై రాష్ట్రాలదే నిర్ణయం
జులై 21 నుంచి అమల్లోకి రాబోయే నూతన మార్గదర్శకాల ప్రకారం 75% వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ ఉచిత వ్యాక్సిన్లలో తొలి ప్రాధాన్యం వైద్య ఆరోగ్య సిబ్బందికి, తర్వాత వరుసగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన వారు, రెండో డోసు వారు, 18 ఏళ్ల పైబడిన వారికి ఇవ్వాలి.
* 18 ఏళ్ల పైబడినవారిలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని రాష్ట్రాలు సొంతంగా తీసుకోవచ్చు.
* జనాభా, రోగ తీవ్రత, ఇప్పటివరకు చేపట్టిన వ్యాక్సినేషన్‌లో ఉన్న పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు కేటాయిస్తుంది.
* దేశీయ తయారీదారులు తాము నెలవారీగా చేసే ఉత్పత్తిలో 25% నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకోవడానికి అనుమతి లభించింది.

మారుమూల ప్రాంతాలకూ సకాలంలో సరఫరా
డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి, చెల్లింపులు చేపట్టడానికి నేషనల్‌ హెల్త్‌ అథారిటీ ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా చేయూతనందిస్తుంది. దీనివల్ల మారుమూల ప్రైవేటు ఆసుపత్రులకూ సకాలంలో వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. ప్రాంతీయ సమతౌల్యం సాధ్యమవుతుంది.
ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధరలను వ్యాక్సిన్‌ తయారీదారులు నిర్ణయిస్తారు. ప్రైవేటు ఆసుపత్రులు గరిష్ఠంగా సర్వీస్‌ ఛార్జి కింద రూ.150 వసూలు చేయడానికి అనుమతి ఇచ్చినందువల్ల అవి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఆదాయాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఉచిత వ్యాక్సిన్‌ అందుకోవడానికే అర్హులే. స్థోమత ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది.

ఉచితం విలువ రూ.1.45 లక్షల కోట్లు
దిల్లీ: దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ వేయడానికి, 80 కోట్ల మంది పేదలకు నవంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడానికి కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల మేర భారాన్ని అదనంగా భరించనుంది. వీటిలో ఒక టీకాలపైనే రూ. 45,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్రం మొదట వేసిన అంచనాల ప్రకారం ఈ మొత్తం రూ. 35,000 కోట్లు. నిరుపేద లబ్ధిదారులకు నెలకు ఐదు కిలోల బియ్యం, లేదా గోధుమలు, ఒక కిలో పప్పు చొప్పున దీపావళి వరకు ఇవ్వడానికి రూ.1.10 లక్షల కోట్ల నుంచి రూ. 1.3 లక్షల కోట్ల వరకు ఖర్చు కానుంది. ఇటీవల భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి.. ఆశించినదానికంటే ఎక్కువగా రూ. 99,122 కోట్లు డివిడెండ్‌ లభించడం, పెట్రో ఉత్పత్తులపై రికార్డు స్థాయిలో పన్నులు జమ అవుతుండడం వల్ల ప్రభుత్వానికి ఈ అదనపు భారం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లకు అదనంగా రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి మరికొద్దిరోజుల్లో మన దేశంలోకి వాణిజ్యపరంగా రానుంది.

ఎలక్ట్రానిక్‌ వోచర్‌తో ఆదుకోవచ్చు

డబ్బున్నవారు ఎలక్ట్రానిక్‌ వోచర్స్‌ని కొనుగోలుచేసి వాటిని ఎవరికైనా ఇవ్వొచ్చు. ఆ వోచర్‌ ఉన్నవారు నేరుగా ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లి దాన్ని చూపి వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.
కొవిన్‌ యాప్‌లో ముందుగా బుకింగ్‌ చేసుకోవడంతోపాటు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఉమ్మడి సేవా కేంద్రాలు, కాల్‌సెంటర్ల సేవలను ఉపయోగించుకోవాలి.

కొవిషీల్డ్‌ రూ.780 కొవాగ్జిన్‌ రూ.1410

దిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాలకు గరిష్ఠ ధరను కేంద్రం నిర్ణయించింది. ఒక డోసు కొవిషీల్డ్‌కు రూ.780, కొవాగ్జిన్‌కు రూ.1,410, స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌కు రూ.1,145 మించకుండా వసూలు చేయాలని స్పష్టంచేసింది. ఇంతకంటే ఎక్కువ ధర అడిగితే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. సేవా రుసుముల కింద ప్రైవేటు ఆసుపత్రులు ఒక డోసుకు గరిష్ఠంగా రూ.150 చొప్పున వసూలు చేసుకోవచ్చని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని