sarscov2: జంతువులకూ సార్స్‌కోవ్‌-2 ముప్పు 

జంతువులకు సార్స్‌కోవ్‌-2 ప్రమాదం ముప్పు పొంచి ఉంది. చాపకింద నీరులా వాటిలోనూ వైరస్‌ విస్తరిస్తోంది. తమిళనాడులో ఇటీవల రోజుల వ్యవధిలోనే రెండు సింహాలు వైరస్‌తో మృత్యువాత పడ్డాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌ జంతు ప్రదర్శనశాలలో...

Updated : 20 Jun 2021 10:13 IST

ప్రయోగాత్మక పరిశోధనలో గుర్తింపు

నిర్ధారణ పరీక్షలకు మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: జంతువులకు సార్స్‌కోవ్‌-2 ప్రమాదం ముప్పు పొంచి ఉంది. చాపకింద నీరులా వాటిలోనూ వైరస్‌ విస్తరిస్తోంది. తమిళనాడులో ఇటీవల రోజుల వ్యవధిలోనే రెండు సింహాలు వైరస్‌తో మృత్యువాత పడ్డాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌ జంతు ప్రదర్శనశాలలో సింహాలకు సార్స్‌కోవ్‌-2 సోకినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో జంతువులకు వైరస్‌ సోకితే నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో సెంట్రల్‌ జూ అథారిటీ, హైదరాబాద్‌లోని సీసీఎంబీ- లాకోన్స్‌తో కలిసి మార్గదర్శకాలను రూపొందించింది. వన్యప్రాణులకే కాదు పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు, కుందేళ్లలకు సార్స్‌కోవ్‌-2 వైరస్‌ సోకే ప్రమాదం ఉందని ప్రయోగాత్మక పరిశోధనలు, నివేదికల ఆధారంగా వెల్లడైనట్లు తెలిపింది. జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. 

నమూనాల సేకరణ ఇలా.. 

జంతువుల్లో సార్స్‌కోవ్‌-2 నమూనాలు కనిపిస్తే.. పీపీఈ కిట్‌ ధరించిన తర్వాతే వాటి ఎన్‌క్లోజర్‌ దగ్గరికి వెళ్లాలి. వీలైతే నోరు, ముక్కు నుంచి స్వాబ్స్‌ సేకరించాలి. లాలాజలం, మల నమూనాలను సేకరించి వీటీఎం (వైరల్‌ ట్రాన్స్‌పోర్టు మీడియం)లో మార్గదర్శకాల ప్రకారం ప్యాక్‌ చేసి ల్యాబ్‌లకు పంపాలి.

పాటించాల్సిన జాగ్రత్తలు

అనుమానిత జంతువులను విడిగా, ఒక ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచాలి. జంతు సంరక్షకులు బోనులోకి వెళ్లి ఆహారం ఇచ్చేటప్పుడు ప్రతిసారీ పీపీఈ కిట్‌, ఫేస్‌ షీల్డ్‌, ఫేస్‌ మాస్క్‌, ఎన్‌-95 మాస్క్‌, చేతికి గ్లౌజులు, కళ్లద్దాలు, షూ కవర్లు ధరించాలి. మాంసాన్ని వేడి నీటిలో 2-3 నిమిషాలు శుభ్రం చేసిన తర్వాతే ఇవ్వాలి. నీటి తొట్టెలను రోజూ శుభ్రం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని