Updated : 29 Jun 2021 09:50 IST

CM KCR: కాకతీయలో పీవీ పీఠం

భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెడతాం
దిల్లీ, వంగర, తెలంగాణ జిల్లాల్లో మాజీ ప్రధాని విగ్రహాలు
శతజయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌  

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పీఠం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వీసీ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామన్నారు. ‘పీవీ మన తెలంగాణ ఠీవీ. ఒక కీర్తి శిఖరం. దీప స్తంభం. స్థితప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు. విద్యానిధి, సాహిత్య పెన్నిధి, సంస్కరణవాది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల నిష్ణాతుడు. ఆయనను ఎంత గౌరవించుకున్నా తక్కువే. ఆ స్ఫూర్తిప్రదాత చరిత్ర అందరికీ ఆదర్శం’ అని కొనియాడారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెడతామని ప్రకటించారు. పీవీ స్వగ్రామంతోపాటు, జిల్లాల్లో, దిల్లీలో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వారి కుటుంబాన్ని గౌరవించుకునేందుకే వాణీదేవికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. ఆమెను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీవీ శతజయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లోని జ్ఞానభూమి(పీవీఘాట్‌)లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

800 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు

‘పీవీ చేపట్టిన భూ సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమయ్యాయి. 800 ఎకరాల విలువైన సొంత భూమిని ఆయన ప్రజలకు ధారాదత్తం చేశారు. ఆ విధంగా తన నిబద్ధతను చాటుకుంటూ భూ సంస్కరణలను అమలు చేశారు. అనేక పుస్తకాలు రచించారు. అనేక రచనలను అధ్యయనం చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలను తీసుకొచ్చారు. ఆయన ప్రారంభించిన గురుకుల పాఠశాలలోనే చదివి డీజీపీని కాగలిగానని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇలా ఎంతో మంది పీవీని స్మరించుకుంటున్నారు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి వల్లే నేడు పెట్టుబడులు వస్తున్నాయి. ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రాల బడ్జెట్‌ రూ.లక్షల కోట్లకు చేరింది. కరోనా అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. విదేశాల్లో నిర్వహించిన మహేశ్‌ బిగాలకు ప్రత్యేక అభినందనలు. ఇవాళ ఆవిష్కరించిన పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఈ రహదారికి ‘పీవీ మార్గ్‌’ అని నామకరణం చేయడం సంతోషంగా ఉంది’ అని సీఎం తెలిపారు.

ఘనంగా శతజయంత్యుత్సవాలు: కేకే

తెలంగాణ శాసనసభలో త్వరలోనే పీవీ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరిస్తారని, మాజీ ప్రధాని సొంతూరు వంగరలో పీవీ పార్కు, మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పీవీ శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కేశవరావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఏడాది కాలం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. కరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయామన్నారు. ఆయన రచనలను వెలుగులోకి తెచ్చామని, నమస్తే పీవీ తదితర తొమ్మిది పుస్తకాలను తీసుకొచ్చామని, వెబినార్లు, అంతర్జాతీయ సమావేశం నిర్వహించామని చెప్పారు. పీవీ ఖ్యాతిని చాటేలా ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి, ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి ప్రశంసించారు.

26 అడుగుల విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం చేసిన అనంతరం 26 అడుగుల మాజీ ప్రధాని విగ్రహాన్ని గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ రాసిన 4, ఆయనపై ఇతరులు రచించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్‌, సీఎం విడుదలచేశారు.

మంత్రుల నివాళి

మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత పీవీకి నివాళులర్పించారు.  హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

తెలంగాణ తల్లి సంతోషిస్తోంది: గవర్నర్‌

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేదల పెన్నిధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆయన రాజకీయాలకతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదర్శమూర్తికి అర్పించిన ఘన నివాళి...తరతరాలకు గుర్తుండిపోతుందన్నారు.

నరసింహారావు సేవలు చిరస్మరణీయం

‘‘శతజయంతి సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళి. దేశ అభివృద్ధికి ఆయన అందించిన విస్తృత సేవలు చిరస్మరణీయం. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం ఆయన సొంతం’’

- ప్రధాని మోదీ

పాలనాదక్షుడు

‘‘చురుకైన పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు శతజయంతి సందర్భంగా నా నివాళి. మాతృభాషలో బోధనను ప్రోత్సహించారు. పీవీ సేవల్ని జాతి చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది’’

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని