తలొగ్గిన గూగుల్‌, ఫేస్‌బుక్‌

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలకు అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర సంస్థలూ తలొగ్గాయి. భారీ స్థాయిలో అభ్యంతరకర కంటెంట్‌ను తమ వేదికల నుంచి తొలగించాయి. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొని, తొలి నెలవారీ నివేదికలను ప్రచురించాయి

Updated : 04 Jul 2021 11:17 IST

అభ్యంతరకర సమాచారం తొలగింపు
కొత్త నిబంధనల ప్రకారం నెలవారీ నివేదిక
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలకు అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా ఇతర సంస్థలూ తలొగ్గాయి. భారీ స్థాయిలో అభ్యంతరకర కంటెంట్‌ను తమ వేదికల నుంచి తొలగించాయి. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొని, తొలి నెలవారీ నివేదికలను ప్రచురించాయి. ఈ పరిణామంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  ‘‘ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. తదితర సంస్థలు కొత్త ఐటీ నిబంధనల ప్రకారం అభ్యంతరకర పోస్టులను స్వచ్ఛందంగా తొలగించి.. తొలి నెలవారీ నివేదికను ప్రచురించడం సంతోషకరం. పారదర్శకత దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. మే 26 నుంచి అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం.. 50 లక్షలకు పైగా ఖాతాదారులున్న సామాజిక మాధ్యమ సంస్థలు అభ్యంతరకర సమాచారాన్ని(కంటెంట్‌) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఫిర్యాదులు స్వీకరిస్తూ.. వాటిని పరిష్కరిస్తూ.. నెలవారీ నివేదికలను విడుదల చేయాలి. ఈ నిబంధనలను పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ట్విటర్‌ అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థకు కల్పించిన ‘సురక్షిత ఆశ్రయం’ హోదాను భారత్‌ రద్దు చేసింది. దీంతో ఎవరైనా ట్విటర్‌పై భారత శిక్షాస్మృతి కింద భారత న్యాయస్థానాల్లో చర్యలు తీసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌ 3 కోట్లు.. ఇన్‌స్టా 20 లక్షలు

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం.. 3 కోట్లకు పైగా కంటెంట్‌ (పోస్టులు, వీడియోలు, ఫొటోలు, కామెంట్లు)పై చర్యలు తీసుకున్నామని ఫేస్‌బుక్‌ తెలిపింది. దాని అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ 20లక్షల కంటెంట్‌పై కొరడా ఝళిపించినట్లు పేర్కొంది. ఈ మేరకు నెలవారీ నివేదికను విడుదల చేశాయి. ఫేస్‌బుక్‌లో చర్యలు తీసుకున్న కంటెంట్‌లో అత్యధికం నకిలీ వార్తలకు సంబంధించినవే కావడం గమనార్హం. 2.5కోట్ల స్పామ్‌ సంబంధిత కంటెంట్‌, హింసను ప్రేరేపించేలా ఉన్న 25లక్షల పోస్టులు, నగ్నచిత్రాలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18లక్షల కంటెంట్‌, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3లక్షల పోస్టులు, ఆత్మహత్యలకు సంబంధించి 5.8లక్షల పోస్టులు, వేధింపులు, ఉగ్రవాద ప్రచారానికి సంబంధించిన కంటెంట్‌పై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ప్రస్తుతానికి ఇది మధ్యంతర నెలవారీ నివేదిక మాత్రమే అని, జులై 15న పూర్తి నివేదికను విడుదల చేస్తామని ఫేస్‌బుక్‌ తెలిపింది. తుది నివేదికలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యలతో పాటు వాట్సాప్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది. ఇటీవల గూగుల్‌ కూడా నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమకు యూజర్ల నుంచి 27వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 60వేల  పోస్టుల్లోని కంటెంట్‌ను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్‌ తన నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌ ఉల్లంఘనకు సంబంధించినవే అని తెలిపింది.


త్వరలోనే ఫిర్యాదుల అధికారిని నియమిస్తాం
-  దిల్లీ హైకోర్టుకు తెలిపిన ట్విటర్‌

దిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు అమల్లో జాప్యం చేస్తున్న ట్విటర్‌.. త్వరలోనే తాము నిబంధనల అమలును పర్యవేక్షించే ముఖ్య అధికారితో పాటు, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని నియమిస్తామని దిల్లీ హైకోర్టుకు తెలిపింది. తాము ఇప్పటికే నియమించిన మధ్యంతర గ్రీవెన్స్‌ అధికారి గత నెల 21న పదవి నుంచి వైదొలిగారని న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కొత్త అధికారిని నియమించే లోపు.. భారతీయ వినియోగదారుల సమస్యలను జనరల్‌ గ్రీవెన్స్‌ అధికారి ద్వారా పరిష్కరిస్తామని..  ఐటీ రూల్స్‌ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌కు స్పందనగా ట్విటర్‌ తెలిపింది. దీనిపై విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ చట్టాల ప్రకారం భారత్‌కు చెందిన వ్యక్తిని రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిగా నియమించాల్సి ఉంటుంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సదరు హోదాలో ఉన్న అధికారి స్పందించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని