Updated : 04 Jul 2021 05:19 IST

భూగర్భ పార్కింగ్‌ కుదరదు

అవసరం మేరకు మొదటి అయిదు అంతస్తులను ఇందుకు ఉపయోగించాలి
రాష్ట్రంలో కొత్త నిర్మాణాలకు ఈ నిబంధన అమలు
ఎకరా.. ఆపైన విస్తీర్ణంలో చేపట్టే వాటికి వర్తింపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు - సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో ఇకపై ఎకరా.. ఆపైన విస్తీర్ణంలో నిర్మితమయ్యే బహుళ అంతస్తుల సముదాయాల్లో భూగర్భ పార్కింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మొదటి అయిదు అంతస్తుల వరకు పార్కింగ్‌ కోసం వాడుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనినే పోడియం పార్కింగ్‌గా పేర్కొంటున్నారు. ముంబయి నగరంలో ఈ వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఒక వేళ రెండు అంతస్తుల్లోనే సరిపోతే ఆ మేరకే ఉపయోగించాలని ప్రభుత్వం పేర్కొంది. అయిదు అంతస్తుల్లో కూడా సరిపోకపోతే రెండు బేస్‌మెంట్‌లకు అనుమతివ్వనున్నట్టు పేర్కొంది. ఈ నియమాలను ఉల్లంఘించి భూగర్భ పార్కింగ్‌కు వెళితే సంబంధిత భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారీ వర్షాల సమయంలో సెల్లార్లలో నీరు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ కొత్త విధానాన్ని తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలిలాంటి అనేక ప్రాంతాల్లో భూగర్భ పార్కింగ్‌లోకి నీరు చేరి ఇబ్బంది తలెత్తింది. నాలుగు అంతస్తుల్లోపల ఉన్న వర్షం నీటిని బయటకు తోడడానికి నాలుగైదు రోజులు పట్టింది. లిఫ్ట్‌ల్లోకి కూడా నీరు వెళ్లడంతో అవి పని చేయడం మానేశాయి.

నాలాలు, చెరువులు పూడుకుపోతున్నాయని కూడా...

భూగర్భ పార్కింగ్‌ నిర్మాణ సమయంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పార్కింగ్‌ నిర్మాణం కోసం చేపట్టే తవ్వకాలతో వచ్చే వేలాది లారీల మట్టిని ఎక్కడ డంప్‌ చేయాలన్నది నిర్మాణదారులకు ఒక సమస్యగా మారింది. చాలామంది ఈ మట్టిని నాలాలు, చెరువుల్లో డంప్‌ చేస్తున్నారు. దీంతో చెరువులు పూడుకుపోతున్నాయి. నాలాల్లో నీరు ముందుకుసాగని పరిస్థితి ఏర్పడింది. దీనిపై క్రెడాయ్‌ కూడా ఇటీవల ప్రభుత్వంతో చర్చించింది. ఉన్నతస్థాయిలో చర్చ తరువాత భూగర్భ పార్కింగ్‌పై నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా 2012లో రూపొందించిన బిల్డింగ్‌ రూల్స్‌ను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. శనివారం రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

సెట్‌బ్యాక్‌లు వదలాల్సిందే..

ఎకరం ఆపైన నిర్మించే భవన సముదాయంలో రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి భవనం ఎంత ఎత్తులో నిర్మించాలన్నది అధికారులు నిర్ధారిస్తారు. ‘‘భవనం ఎత్తు 55 మీటర్ల లోపు ఉంటే 7 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. ఆ తర్వాత వాటికి 9 మీటర్ల సెట్‌బ్యాక్‌ ఉండాలి. భవనం ముందు భాగంలో ప్రహరీ నిర్మించకూడదు. ఈ భవన సముదాయానికి వచ్చే వాహనదారు సెట్‌ బ్యాక్‌ స్థలంలో వాహనాన్ని ఆపేలా ఏర్పాట్లు ఉండాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల ఆ భవన సముదాయం ముందు ట్రాఫిక్‌ సమస్య ఏర్పడదని అధికారులు చెబుతున్నారు. రాజధాని నగరంలో హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఏటా ఎకరం.. ఆపైన విస్తీర్ణంలో 200 నుంచి 300 బహుళ అంతస్తుల సముదాయాలకు అనుమతి ఇస్తోంది. దాదాపు 20 వేల నుంచి 40 వేల వరకు ఫ్లాట్లు ఇక్కడ నిర్మాణమవుతున్నాయి. ఇటువంటి బహుళ అంతస్తుల సముదాయాల్లో ఈ కొత్త నిబంధన వెంటనే అమలు చేయాల్సిందే.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని