నేటి కృష్ణా బోర్డు సమావేశం వాయిదా

కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి వినియోగం, ఇతర అంశాలపై చర్చించి ఓ అంగీకారానికి వచ్చేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డు సభ్యకార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.

Updated : 09 Jul 2021 08:01 IST

జల వివాద నేపథ్యంలో ప్రాధాన్యం
తదుపరి సమావేశంలోపు పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌!
ఈనాడు - హైదరాబాద్‌

కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి వినియోగం, ఇతర అంశాలపై చర్చించి ఓ అంగీకారానికి వచ్చేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డు సభ్యకార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ మీటింగ్‌కు హాజరుకావడానికి ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయం తీసుకోగా.. వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. నీటి వాటాలో తెలంగాణకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ఎజెండాలో చేర్చలేదని పేర్కొంది. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు మీటింగ్‌ ఏర్పాటు చేయాలని అడిగింది. కొత్తగా బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ సింగ్‌ దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి వాయిదాకు నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. శుక్రవారం జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి గురువారం రెండు రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లకు లేఖ రాశారు. సమావేశం ఎప్పుడన్నది తర్వాత నిర్ణయిస్తామన్నారు.

సగం వాటా ఇవ్వాల్సిందే.. తెలంగాణ

తదుపరి సమావేశంలోపు పూర్తిస్థాయి బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో బోర్డు ఛైర్మన్‌, సభ్యకార్యదర్శి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, బోర్డులో విద్యుత్తు విభాగాన్ని పర్యవేక్షించే చీఫ్‌ ఇంజినీర్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటివరకు ఒక రాష్ట్రం రాసిన లేఖను ఇంకో రాష్ట్రానికి పంపడం, తమ సూచనలను రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కేంద్రానికి నివేదించడానికే బోర్డు పరిమితమైంది. త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడినందున పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగే వరకు నీటి వినియోగం తదితర అంశాలపై వివాదం కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌ 66 శాతం, తెలంగాణ 34 శాతం వినియోగించుకునేలా గతంలో నిర్ణయం జరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో దీనిని 50:50 నిష్పత్తికి మార్చాలని తెలంగాణ కోరుతోంది. ఇలాంటి అనేక అంశాలు బోర్డు సమావేశంలో ఎజెండాగా ఉండే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని