CBI: వాదనలకు సిద్ధం కావాల్సి ఉంది

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి తాము సిద్ధం కావాల్సి ఉందని, కొంత గడువు కావాలంటూ దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలుచేసింది.

Updated : 15 Jul 2021 09:21 IST

జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌లో సీబీఐ

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి తాము సిద్ధం కావాల్సి ఉందని, కొంత గడువు కావాలంటూ దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలుచేసింది. పిటిషన్‌పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. ఈ పిటిషన్‌లో నిందితులు, పిటిషనర్ల వాదనలను పరిశీలించడానికి 10 రోజుల గడువు కావాలని సీబీఐ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.గోపీనాథ్‌ కోరారు. దీనిపై రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీవెంకటేష్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూన్‌ 1, జులై 8న తాము వాదనలు వినిపించబోమని, కోర్టు విచక్షణకే వదిలిపెడుతున్నట్లు చెప్పారన్నారు. విచారణలో జాప్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వాదనలను విన్న సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

ఇందూ టెక్‌జోన్‌ కేసులో సబితా ఇంద్రారెడ్డి పిటిషన్‌

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ టెక్‌జోన్‌ కేసు నుంచి తనను తప్పించాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాజెక్టు కేటాయింపు నిబంధనల ప్రకారమే జరిగిందని చెప్పారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, ఎంఎస్‌ జీ2 కార్పొరేట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఇందూ ప్రాజెక్ట్స్‌, ఎస్పీఆర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, దామర పార్థసారథిరావు డిశ్ఛార్జి పిటిషన్ల దాఖలుకు గడువు కోరారు. ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ టెక్‌జోన్‌ల తరఫున డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేయబోమని, అభియోగాల నమోదు ప్రక్రియపై వాదనలు వినిపిస్తామని చెప్పడంతో కోర్టు వీటిపై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. సీబీఐ కోర్టులో ఓబుళాపురం కేసు విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా పడింది. ఎలాంటి కఠినచర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కాపీని ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి అందజేశారు. వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరడంతో విచారణ వాయిదా వేసింది. ఎమ్మార్‌కు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని