చికెన్‌పాక్స్‌ తరహాలో డెల్టా విజృంభణ

కరోనా వైరస్‌లోని ఇతర రకాల కన్నా డెల్టా వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతోంది. ఇది చికెన్‌ పాక్స్‌ తరహాలో చాలా సులభంగా వ్యాప్తి చెందుతోంది.

Published : 31 Jul 2021 04:28 IST

అమెరికా సీడీసీ నివేదిక

న్యూయార్క్‌: కరోనా వైరస్‌లోని ఇతర రకాల కన్నా డెల్టా వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతోంది. ఇది చికెన్‌ పాక్స్‌ తరహాలో చాలా సులభంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఒక అంతర్గత పత్రాన్ని తయారుచేసింది. అందులోని అంశాలను అక్కడి మీడియా తాజాగా ప్రచురించింది. టీకా పొందినవారికి ఈ డెల్టా వేరియంట్‌ సోకినప్పుడు వారి ముక్కు, గొంతులోని వైరల్‌ లోడు.. వ్యాక్సిన్‌ పొందనివారి స్థాయిలోనే ఉండొచ్చని సీడీసీ డైరెక్టర్‌ రోషెల్‌ పి వాలెన్‌స్కీ ఇటీవల తెలిపారు. ఇంచుమించుగా వారి ద్వారా కూడా వైరస్‌ అదే స్థాయిలో వ్యాప్తి చెందొచ్చని పేర్కొన్నారు. తాజా అంతర్గత పత్రంలో మరిన్ని ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. డెల్టా వేరియంట్‌పై సీడీసీ శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతున్న కలవరాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. అందులోని ముఖ్యాంశాలివీ..

* మెర్స్‌, సార్స్‌, ఎబోలా, సాధారణ జలుబు, సీజనల్‌ ఫ్లూ, మశూచి వంటి వైరస్‌ల కన్నా అధిక వేగంతో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందుతోంది. దీని సంక్రమణ శక్తి.. దాదాపుగా చికెన్‌పాక్స్‌ స్థాయిలో ఉంది.

* అమెరికాలో వ్యాక్సిన్‌ పొందిన 16.2 కోట్ల మందిలో వారానికి 35వేల మందికి తీవ్ర వ్యాధి లక్షణాలతో కరోనా సోకుతోంది. స్వల్ప, ఎలాంటి లక్షణాలు లేని కొవిడ్‌ బాధితులను సీడీసీ పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల వాస్తవంగా కరోనా కేసులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు.

* కరోనాలో ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా రకం బారినపడినవారి శ్వాస నాళాల్లో వైరల్‌ లోడు 10 రెట్లు ఎక్కువగా ఉంటోంది. నిజానికి ఆల్ఫా రకానికీ సాంక్రమిక శక్తి ఎక్కువే. అదే వుహాన్‌లో వెలుగు చూసిన మొదటి రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ సోకినవారిలో వైరల్‌ లోడు వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది.

* డెల్టా తీవ్రత నేపథ్యంలో కరోనాపై పోరు మారిందని అంగీకరించడమే సీడీసీ తదుపరి చేయాల్సిన పని. ఈ వైరస్‌ ముప్పు దృష్ట్యా తక్షణ చర్యలు అవసరం.

* టీకా పొందినవారు దాదాపుగా సురక్షితమే. వారు తీవ్ర అనారోగ్యం బారినపడకుండా వ్యాక్సిన్లు 90 శాతం మేర అడ్డుకుంటాయి. అయితే ఇన్‌ఫెక్షన్‌ నివారణ, వ్యాప్తి కట్టడిలో అవి అంత సమర్థత చాటలేకపోతున్నాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని