Published : 15 Aug 2021 03:30 IST

డీపీఆర్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ పని

రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణాబోర్డు కమిటీ నివేదిక

ఈనాడు హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి అవసరమైన దానికంటే ఎక్కువ పని జరిగిందని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు పేర్కొంది. తమ పర్యటన సమయంలో ప్రాజెక్టు వద్ద నిర్మాణ కార్యకలాపాలేమీ లేవని, రెండు బ్యాచింగ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు కంకర, ఇసుక నిల్వలు ఉన్నాయని తెలిపింది. డీపీఆర్‌ తయారీకి 2010లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు ఇచ్చిందని, వీటి ప్రకారం అవసరమైన పని కంటే ఎక్కువ జరిగిందని తేల్చింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కు నివేదిక సమర్పించింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఆంధ్రప్రదేశ్‌ పనులు చేస్తోందని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌, తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేయగా, తాము డీపీఆర్‌కు అవసరమైన పని మాత్రమే చేశామని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. దీనిపై వాస్తవ నివేదికను సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, సభ్యుడు (విద్యుత్తు) ఎల్‌.బి.ముతంగ్‌, కేంద్రజలసంఘం డైరెక్టర్‌ దర్పణ్‌ తల్వర్‌లతో కూడిన కమిటీ ఈ నెల 11న రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇచ్చింది. దీనిపై ఈ నెల 16న జరిగే ఎన్జీటీ సమావేశంలో చర్చ జరగనుంది. వివిధ పనులకు సంబంధించి నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

* అప్రోచ్‌ ఛానల్‌: శ్రీశైలంలో నీటిమట్టం 884.8 అడుగులు ఉన్నందున అప్రోచ్‌ ఛానల్‌ మొత్తం నీటిలో ఉంది. అప్రోచ్‌ ఛానల్‌ పని పాక్షికంగా చేశామని, వివిధ ప్రాంతాల్లో 30 శాతం వరకు జరిగిందని సంబంధిత చీఫ్‌ ఇంజినీర్‌ కమిటీకి నివేదించారు. బెడ్‌ లెవెల్‌ 800 అడుగుల మట్టం వరకు తవ్వలేదన్నారు. అప్రోచ్‌ ఛానల్‌ నీట మునిగినందున ఎంత పని జరిగిందనేది అంచనా వేయలేకపోయాం. అప్రోచ్‌ ఛానల్‌, ఫోర్‌బే (నీటిని నిల్వ చేసే బావి) మధ్య 15 మీటర్ల మేర ఎలాంటి పని జరగలేదు. దీనివల్ల అప్రోచ్‌ ఛానల్‌ నుంచి ఫోర్‌బేలోకి నీళ్లు రాలేదు.

* ఫోర్‌బే: ఈ పనిలో ఎక్కువ భాగం జరిగింది. పూర్తి పొడవు 237 మీటర్లు, వెడల్పు కూడా వివిధ లోతుల్లో తవ్వారు. పంపుహౌస్‌ వైపు 150 నుంచి 180 అడుగుల వరకు జరిగింది. రెండు వైపులా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఫోర్‌బే గోడలకు షాట్‌ క్రీటింగ్‌ (మట్టి పడకుండా సిమెంటు తాపడం) జరిగింది.

* పంపుహౌస్‌: 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు గల పంపుహౌస్‌ 730 అడుగుల వరకు తవ్వారు. డెలివరీ టన్నెల్స్‌ తవ్వకం దిగువ వరకు జరిగింది. షాట్‌ క్రీటింగ్‌ కూడా చేశారు.

* పైప్‌లైన్‌ (డెలివరీ మెయిన్‌): 12 సొరంగాలకు గాను పది తవ్వారు. అయిదు మీటర్ల డయా పైపులైన్‌కు తగ్గట్లుగా తవ్వకం జరిగింది. 35 నుంచి 50 మీటర్ల పొడవు తవ్వారు. ప్రారంభంలో షాట్‌ క్రీటింగ్‌ చేశారు.

* డెలివరీ సిస్టర్న్‌, లింక్‌ కెనాల్‌: డెలివరీ సిస్టర్న్‌ పూర్తి పొడవు, వెడల్పు పని జరిగింది. డెలివరీ సిస్టర్న్‌ లోతు కూడా ఎక్కువగానే తవ్వారు. దీని నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు.. లింక్‌ కాలువ 500 మీటర్ల దూరం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని